Dil Raju: డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే డిస్ట్రిబ్యూషన్ సైతం కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వందల థియేటర్స్ తన అధీనంలో ఉంచుకుని తెలుగు సినిమాను శాసిస్తున్నారు. ఒక సినిమా విడుదల కావాలంటే దిల్ రాజు కరుణించాల్సిందే. బడా స్టార్స్ కి కూడా దిల్ రాజు చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. కాగా దిల్ రాజు అధిపత్యానికి గండిపడుతూ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి బ్యానర్స్ దిల్ రాజుకి ధీటుగా ఎదిగాయి.
మైత్రీ మూవీ మేకర్స్ అటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా దిల్ రాజుని దెబ్బ తీసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తమ చిత్రాలతో పాటు ఇతర చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో దిల్ రాజు ప్రభావం తగ్గుతూ వస్తుంది. మరోవైపు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్ అద్భుతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. దిల్ రాజు బ్యానర్ లో మూవీ అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే బ్రాండ్ నేమ్ ఉండేది. ఇప్పుడు అది లేదు.
శాకుంతలం మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉండి దిల్ రాజు భారీగా నష్టపోయాడు. అలాగే విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ నష్టాలు మిగిల్చింది. నెగిటివ్ రివ్యూస్ తో ది ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దెబ్బ తీశారంటూ దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు. తన బ్యానర్ లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ స్టార్ట్ చేశాడు. శంకర్ కారణంగా ఈ మూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగింది. అనుకున్న సమయం కంటే ఏడాది కాలం ఎక్కువ తీసుకుంది. మధ్యలో భారతీయుడు 2 షూటింగ్ బాధ్యతలు తీసుకుని.. దిల్ రాజుకు శంకర్ చుక్కలు చూపించాడు
గేమ్ ఛేంజర్ భారీ ఓపెనింగ్స్ రాబడితేనే రికవరీ సాధ్యం. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో దిల్ రాజుపై పిడుగు పడ్డట్లు అయ్యింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అన్నారు. అంతవరకు పర్లేదు. అసలు టికెట్స్ ధరల పెంపు ఉండదని చెప్పడం ద్వారా భారీ ఝలక్ ఇచ్చాడు. ఇది గేమ్ ఛేంజర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సంక్రాంతికి విడుదలవుతున్న మరొక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా దిల్ రాజే నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రసన్నం చేసుకోవాలని దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు అనేది కీలకం. ససేమిరా అంటే దిల్ రాజు నష్టపోవడం ఖాయం.