Maaran: ధనుష్ నుంచి సినిమా వస్తోందంటే చాలు తమిళ అభిమానులతో పాటు, తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా, యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా మారన్. ఈ సినిమాలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటోంది.

ఈ సినిమాకు జివి ప్రకాశ్ సంగీతం అందించారు. ధ్రువ పదహారు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్.. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో.. మారన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
దీంతో ఒక్కసారిగా ధనుష్ అభిమానులు మారన్‌ను థియేటర్లోనే విడుదల చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో థనుష్ స్పందిస్తూ… తన సినిమా ఓటీటీలో విడుదల కావడం ఇష్టం లేదని ట్వీట్ చేశారు. దీంతో మరాన్ సినిమాను ఖచ్చితంగా ఓటీటీలో రాదని అందరూ అనుకున్నారు. అయితే, ఈ వార్తతో అభిమానులకు నిరాశ ఎదురైంది. దీంతో మారన్‌ను ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మేకర్స్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
కాగా, ధనుష్ వరుసగా సనిమాలతో బిజిగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కిస్తోన్న నానే వరువేన్ సినిమాలో నటిస్తున్నారు ధనుష్.