Project K : ప్రభాస్ ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఒక్క దర్శకుడు కూడా వాళ్ళలో సంతోషం నింపలేకపోతున్నాడు. అభిమాన హీరో అప్డేట్ అంటే ఫ్యాన్స్ లో జోష్ ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం ఆందోళనలు మొదలవుతున్నాయి. ట్రోల్స్, క్రిటిసిజం పెద్ద ఎత్తున ఫేస్ చేస్తున్నారు. సాహో నుండి ఆదిపురుష్ వరకు ప్రభాస్ ని గొప్పగా చూపించిన దర్శకుడు లేడనే వాదన మొదలైంది. నాగ అశ్విన్ అలా కాదు. ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇస్తారనుకుంటే… ఆయన కూడా ఉసూరుమనిపించారు.
ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ డబుల్ డిజాస్టర్. అసలు ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. పోస్టర్ నేపథ్యం కానీ, ప్రభాస్ లుక్ కానీ నిరాశపరిచాయి. చెప్పాలంటే మార్ఫింగ్ ఫోటోలా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. దీని కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చాలా బెటర్ అని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయ పడ్డారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ప్రాజెక్ట్ కే టీమ్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కొంచెం మార్పులతో మరో పోస్టర్ విడుదల చేశారు. లుక్ సేమ్, కానీ బ్యాక్ గ్రౌండ్ మార్చి మరలా మరొకటి వదిలారు.
ఒక్క పోస్టర్ ప్రాజెక్ట్ కే చిత్రం మీద అంచనాలు తలకిందులు చేసింది. నాగ అశ్విన్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నీ నుండి చాలా ఆశించాము, ఫస్ట్ లుక్ నిరాశపరిచింది అంటున్నారు. కొన్ని గంటల్లో విడుదల కానున్న టీజర్ తో ప్రాజెక్ట్ కే భవిష్యత్ తేలనుంది. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లిమ్ప్స్ సైతం ఆదిపురుష్ తరహా అరాకొరా గ్రాఫిక్స్ తో, కంటెంట్ లేకుండా ఉంటే ఆశలు వదులుకోవాల్సిదే. అందులోనూ ప్రాజెక్ట్ కే టైటిల్ టీజర్ అంతర్జాతీయ సినిమా వేదిక శాన్ డియాగో కామిక్ కాన్ లో విడుదల చేస్తున్నారు.
కనీస ప్రమాణాలు లేని సినిమాను భారతీయ చిత్రంగా వరల్డ్ సినిమా వేదిక మీద ప్రెజెంట్ చేస్తే పరువు గోవిందా అవుతుంది. కాగా ప్రాజెక్ట్ కే చిత్రం దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. నిర్మాత అశ్వినీదత్. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని కీలక రోల్స్ చేస్తున్నారు. 2024 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.