Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆయన రాజకీయ విమర్శలు చేశారు. జగన్ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు.సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చాలా రకాల కామెంట్స్ చేశారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఆయనపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. విచారణకు హాజరు కావాలన్నది ఆ నోటీసుల సారాంశం. ఇంతలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మోపిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో రాంగోపాల్ వర్మ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు చూసిన న్యాయమూర్తులు ఆయన పిటిషన్ ను రద్దు చేశారు. అరెస్టు చేయకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో రాంగోపాల్ వర్మ లో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయింది. ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక మార్గం బెయిల్ పిటిషన్. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీస్ విచారణకు డుమ్మా కొట్టారు. తనకు నాలుగు రోజుల సమయం కావాలని ఏకంగా పోలీసులకు మెసేజ్ రూపంలో సమాచారం ఇచ్చారు.
* అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు
అప్పటి సీఎం జగన్ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పెట్టిన పోస్టులు వివాదాస్పదం అయ్యాయి. వీరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అప్పట్లో వర్మ పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. అందుకే కేసు విచారణకు ఈరోజు హాజరు కావాలని కోరుతూ పోలీసులు నోటీసులు అందించారు. కానీ ఈరోజు విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. తనకు నాలుగు రోజుల సమయం కావాలని ఆయన కోరడం విశేషం. అది కూడా తనదైన స్టైల్ లో వాట్సాప్ లో పోలీసులకు ఈ సమాచారం అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* అరెస్టుకు రంగం సిద్ధం
మరోవైపు రాంగోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో రాంగోపాల్ వర్మ విచారణకు గైర్హాజరు అయ్యారు. క్వాష్ పిటిషన్ కొట్టివేత సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే బెయిల్ తెచ్చుకోవచ్చని సూచించింది. ఈ సూచనలను అనుసరించి రామ్ గోపాల్ వర్మ నాలుగు రోజుల సమయాన్ని పోలీసులకు అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ కు సిద్ధంగా ఉంటే.. మాత్రం ఈ క్షణంలోనైనా అరెస్టు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం నాలుగు రోజులు ఆగే సూచనలు కనిపిస్తున్నాయి.