Coming to Sankranti : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ముక్క కోసం ప్రేక్షకులు యుద్దాలు చేసే పరిస్థితి వచ్చింది. బుక్ మై షో యాప్ ని తెరిచి చూస్తే చాలు ఎర్ర సముద్రం కనిపించేది. అలాంటి బుకింగ్స్ ని సొతం చేసుకుంది ఈ చిత్రం. నిన్న అటు ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, ఇటు తెలంగాణాలో కానీ మొత్తం కలిపి బుక్ మై షో యాప్ లో కనీసం వెయ్యి టికెట్స్ కూడా మిగలలేదంటే ఎలాంటి ర్యాంపేజ్ వసూళ్లు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
విక్టరీ వెంకటేష్ కి మొదటి నుండి బలమైన ప్రాంతాలలో ఒకటి నైజాం. ఒకప్పుడు ఆయన ఈ ప్రాంతంలో ఓపెనింగ్ రికార్డ్స్,క్లోజింగ్ రికార్డ్స్ మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. అయితే గత రెండు దశాబ్దాల నుండి ఆయన సోలో హీరో గా సరైన బ్లాక్ బస్టర్ ని అందుకోలేదు. అత్యధిక శాతం మల్టీ స్టార్రర్ చిత్రాలకే పరిమితం అయ్యాడు. సోలో హీరోగా చేసినప్పటికీ కూడా అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చాలా కాలం తర్వాత సోలో హీరో గా ఆయన మరోసారి ‘నైజాం’ ప్రాంతం లో తన పట్టు చూపించాడు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. వెంకటేష్ కెరీర్ లోనే ఇది ఆల్ టైం రికార్డు. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఉత్తరాంధ్ర ప్రాంతం లో రెండు కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 25 లక్షలు, ఉభయగోదావరి జిల్లాలో నాలుగు కోట్ల 20 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు 16 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలకు కలిపి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి విడుదలకు ముందు 33 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈరోజు తో 90 శాతం కి పైగా రికవరీ అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఈ చిత్రం మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.