Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు సినీ ప్రముఖులు. ఫిలింఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి చిరు, బాలయ్య, వెంకటేష్ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అని జీర్ణించుకోవడం కష్టం. ఆయన మృతి చాలా చాలా దురదృష్టకరం. ఆయనతో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తి నేనే. నాతో మాట్లాడిన తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరారు. మంచి వైద్యం కోసం చెన్నై తీసుకెళ్తానని కూడా నేను ఆయనకు చెప్పాను. కానీ ఇలా జరగడం మన దురదృష్టం.
‘ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఆయన నన్ను ‘మిత్రమా’ అని పిలుస్తుండే వారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. మంచి మిత్రుడిని కోల్పోయాను’ అని ఎమోషనల్ గా మాట్లాడిన చిరు.. ఆయన జ్ఞాపకార్థం తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం చేస్తాం’ అని తెలియజేశారు.
Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన మహేష్ బాబు…
బాలకృష్ణ కూడా సీతారామశాస్త్రి గారి గురించి మాట్లాడుతూ.. పుట్టిన జాతికి కీర్తి తెచ్చిన వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. నేను నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం నా పూర్వ జన్మ సుకృతం. ఆయన్ను నేను ఎప్పుడూ కలిసినా సాహిత్యం గురించే మాట్లాడుకునేవాళ్లం. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను’ అని బాలయ్య చెప్పారు.
హీరో వెంకటేశ్ కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఆయన మృతితో మనం సాహిత్యరంగంలో ఓ లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్ తొలినాళ్ల నుంచి సిరివెన్నెల గారితో కలిసి పనిచేశాను. స్వర్ణకమలం నుంచి నారప్ప వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని వెంకీ తెలిపారు.
Also Read: Sirivennela Family: సిరివెన్నెల కుమారులు ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారని మీకు తెలుసా?