చిరంజీవి రీమేక్ స్టారా..? సూప‌ర్ హిట్ల‌న్నీ అవేనా..?!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి మ‌కుటం లేని మ‌హారాజులా వెలుగొందారు. ఇప్ప‌టికీ స్టార్ డమ్ గురించిన చ‌ర్చ వ‌స్తే.. చిరంజీవి త‌ర్వాత ఎవ‌రు అని మొద‌ల‌వుతుంది ఆ డిస్క‌ష‌న్‌. అంత‌లా.. తెలుగు తెర‌పై త‌న సంత‌కం చేశారు చిరు. టాలీవుడ్‌లో మెజారిటీ స‌క్సెస్ రేటు ఉన్న హీరోగా ఉన్న చిరు.. రెండు ద‌శాబ్దాల పాటు నెంబ‌ర్1 హీరోగా కొన‌సాగారు. అయితే.. ఆయ‌న మెగాస్టార్ గా మార‌డంలో స్ట్ర‌యిట్ చిత్రాలదే పెద్ద పాత్ర‌. అయితే.. రీమేకులు కూడా ఆయ‌న […]

Written By: Rocky, Updated On : March 5, 2021 1:26 pm
Follow us on


తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చిరంజీవి మ‌కుటం లేని మ‌హారాజులా వెలుగొందారు. ఇప్ప‌టికీ స్టార్ డమ్ గురించిన చ‌ర్చ వ‌స్తే.. చిరంజీవి త‌ర్వాత ఎవ‌రు అని మొద‌ల‌వుతుంది ఆ డిస్క‌ష‌న్‌. అంత‌లా.. తెలుగు తెర‌పై త‌న సంత‌కం చేశారు చిరు. టాలీవుడ్‌లో మెజారిటీ స‌క్సెస్ రేటు ఉన్న హీరోగా ఉన్న చిరు.. రెండు ద‌శాబ్దాల పాటు నెంబ‌ర్1 హీరోగా కొన‌సాగారు. అయితే.. ఆయ‌న మెగాస్టార్ గా మార‌డంలో స్ట్ర‌యిట్ చిత్రాలదే పెద్ద పాత్ర‌. అయితే.. రీమేకులు కూడా ఆయ‌న స‌క్సెస్ జ‌ర్నీలో కీ రోల్ ప్లే చేశాయ‌నే చెప్పుకోవాలి. చిరును మెగాస్టార్ గా మార్చ‌డంలో ఆ చిత్రాలు కూడా త‌మ వంతు పాత్ర పోషించాయి. మ‌రి, అవేంటీ.. అన్న‌ది చూద్దామా!

Also Read: సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసు.. ఎన్‌సీబీ 30,000 పేజీల చార్జిషీట్..

చ‌ట్టానికి క‌ళ్లు లేవుః చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 1981లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇందులో చిరు-మాధ‌వి జంట‌గా న‌టించారు. చిరంజీవి కెరీర్ లో ఇదే తొలి రీమేక్‌. త‌మిళ్ లో వ‌చ్చిన ‘స‌ట్టం ఓరు ఇరుత్త‌ర‌య్‌’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు.

ఖైదీః ఈ సినిమా అధికారికంగా రీమేక్ కాదు. అయితే.. ‘ఫ‌స్ట్ బ్ల‌డ్‌’ అనే సినిమా ఆధారంగా తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన సూపర్ హిట్ మూవీ ఇది. 1983లో వచ్చిన ఈ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సుమలత నటించారు.

విజేతః మ‌న ప‌క్కింట్లో జ‌రుగుతున్న క‌థే.. అనిపించేలా ఉంటుందీ సినిమా. జీవితంలో విజ‌యం సాధించ‌డానికి ఏదైనా చేసేయాల‌నే ఫీలింగ్ క‌లిగిస్తుందీ చిత్రం. బాలీవుడ్ మూవీ ‘సాహెబ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఇందులో భానుప్రియ హీరోయిన్ గా న‌టించింది. ఈ కుటుంబ క‌థాచిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది.

ప‌సివాడి ప్రాణంః ఇది మ‌లాయాళం మూవీ ‘పూవిను పుతియా’ చిత్రానికి రీమేక్‌. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో విజ‌య‌శాంతి హీరోయిన్ గా న‌టించింది. 1987లో వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లోనే రూ.5 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు నెల‌కొల్పింది.

ఖైదీ నెంబ‌ర్ 786ః చిరంజీవి కెరీర్లో మ‌రో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇది. విజ‌య బాపినీడు తెర‌కెక్కించిన ఈ సినిమాలో భాను ప్రియ హీరోయిన్ గా న‌టించింది. ఈ చిత్రం ఒరిజిన‌ల్ త‌మిళ్ లో వ‌చ్చింది. ‘అమ్మన్ కొవిల్ కిజకాలె’ అనే చిత్రాన్ని రీమేక్ చేశారు.

ఘరానా మొగుడుః క‌న్న‌డ చిత్రం ‘అనురాగ ఆరాలితు’కు ఇది రీమేక్‌. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొట్టింది. తెలుగులో రూ.10 కోట్లు వ‌సూలు చేసిన మొద‌టి సినిమా ఇది. ఈ సినిమా ద్వారా దేశంలోనే అత్య‌ధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు మెగాస్టార్‌. ఈ చిత్రాన్ని 1993లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లూ కూడా ప్ర‌ద‌ర్శించారు.

హిట్ల‌ర్ః అంత‌కు ముందు వ‌ర‌కూ చిరంజీవి చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా ప‌రాజ‌యం పాల‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో చేసిన ‘హిట్లర్’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇది మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘హిట్లర్’ చిత్రానికి రీమేక్.

Also Read: మూవీ రివ్యూః క్లైమాక్స్‌

ఠాగూర్ః టాలీవుడ్లో ఈ చిత్రం ఏ స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 2003లో వ‌చ్చిన ఈ చిత్రానికి వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిరు స‌ర‌స‌న జ్యోతిక‌, శ్రియ న‌టించారు. అవినీతిని తుద‌ముట్టించే ఠాగూర్ గా మెగాస్టార్ విశ్వ‌రూపం చూపించారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిల్మ్ అకాడ‌మీ పుర‌స్కారాల వేడుక‌లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు.

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ః 2004లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. జ‌యంత్ సి.ప‌రాన్జీ డైరెక్ష‌న్లో వ‌చ్చిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ, ఎమోష‌న్తో సాగిపోయింది. ఈ చిత్రం రూ.51 కోట్లు వ‌సూలు చేసి, సంచ‌ల‌నం సృష్టించింది. దీని సీక్వెల్ ‘శంక‌ర్ దాదా జిందాబాద్‌’ కూడా ‘లగే రహో మున్నాభాయ్’ రీమేక్ గా వచ్చిందే.

ఖైదీ నెం.150ః ఖైదీ పేరుతో వ‌చ్చిన మెగాస్టార్ మూడో చిత్రమిది. ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చారు చిరు. త‌మిళ్ లో విజ‌య్ హీరోగా వ‌చ్చిన ‘కత్తి’ చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీని వి.వి. వినాయ‌క్ తెర‌కెక్కించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌పంచానికి వెల్ల‌డించిన చిత్ర‌మిది. ఈ మూవీ కూడా భారీ క‌లెక్ష‌న్లు సాధించింది.

ఇవేకాకుండా.. మ‌రో రెండు చిత్రాలను రీమేక్ చేయ‌బోతున్నారు చిరు. అందులో మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ హీరోగా వ‌చ్చిన ‘లూసీఫర్’ ఒకటి. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రెండోది ‘వేదాళం’. దీన్ని మెహర్ రమేష్ తెరకెక్కించబోతున్నారు. ఈ విధంగా.. మెగాస్టార్ జైత్రయాత్రలో రీమేక్ సినిమాల పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్