Chhaava Collection
Chhaava Collection: చాలా కాలం తర్వాత ఒక బాలీవుడ్ సినిమా పేరు దేశమంతటా గట్టిగా వినిపిస్తుంది. కేవలం సౌత్ ఇండియన్స్ మాత్రమే కాదు, మేము కూడా సమర్థవతంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను తీయగలము అని రీసెంట్ గా విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రంతో నిరూపించారు. మన చిన్నప్పటి పాఠ్య పుస్తకాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చదివే ఉంటాము. కానీ ఆ మహావీరుడికి పుట్టిన మరో మహాయోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి మాత్రం చదువుకొని ఉండము. శంభాజీ మహారాజ్ తండ్రిని మించిన తనయుడు. మొఘల్ రాజు ఔరంగజేబు కి ముచ్చమటలు పట్టించిన మహా యోధుడు. హిందూ మతాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాలను సమర్పించిన అమరజీవి. ఇతని గురించి మనం చాలా తక్కువ మాత్రమే విన్నాము. అందుకే డైరెక్టర్ లక్ష్మణ్ శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని దేశం మొత్తం తెలుసుకోవాలి, ఆయన పోరాటం ఎలాంటిదో గుర్తించాలి అనే గొప్ప ఉద్దేశ్యంతో ‘చావా’ చిత్రం చేసాడు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ సాధారణమైనది కాదు. కమర్షియల్ సినిమాలు ఆడడం వేరు, ఇలాంటి చరిత్రకు సంబంధించిన సినిమాలు ఆడడం వేరు. ప్రేక్షకుల హృదయాలను కదిలించే విధంగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ చావా చిత్రం, బాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జోరుని చూస్తుంటే ఫుల్ రన్ లో పుష్ప 2 రికార్డ్స్ కూడా డేంజర్ లో పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు, గడిచిన పదేళ్లలో ఏ సినిమాకి కూడా చూడలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. సాధారణంగా సోమవారం వచ్చే వసూళ్ల కంటే, మంగళవారం వచ్చే వసూళ్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది ‘చావా’ చిత్రానికి మొత్తం రివర్స్ అయ్యింది.
సోమవారం రోజున (4వ రోజు) ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా 24 కోట్ల 10 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, మంగళవారం రోజున(5వ రోజు) ఏకంగా 25 కోట్ల 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇలా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మంగళవారం రోజున ఏదైనా హాలిడేనా అంటే అది కూడా కాదు. అయినప్పటికీ అంతటి వసూళ్లు వచ్చాయంటే సాధారణమైన విషయం కాదు. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరో గా ఉన్నటువంటి విక్కీ కౌశల్(Vicky Kaushal) ఈ చిత్రంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అదే విధంగా ‘యానిమల్’, ‘పుష్ప 2’ తర్వాత హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) ఖాతాలో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. మొత్తం మీద ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా 5 రోజులకు కలిపి 171 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, సెలవు దినం కావడంతో నేటితో ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను అందుకుంటుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.