టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కుమారుడు, హీరో అరుణ్ కుమార్ కు షాక్ తగిలింది. తాజాగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదైంది.
దాసరి మరణించక ముందు వరకూ ఆయన కుటుంబంలో ఎలాంటి విభేదాల లేవు. కానీ ఆయన మరణం ఆస్తులు, అప్పులపై కుమారులిద్దరూ గొడవకు దిగి రచ్చ చేసుకొని ఇండస్ట్రీలో ఆయన పరువు తీసిన సంగతి తెలిసిందే. తాజాగా దాసరి నారాయణరావు తీసుకున్న అప్పు విషయంలో గొడవ జరిగిందని.. ఈ మేరకు దాసరి అరుణ్ పై ఈ కేసు నమోదైనట్టు తెలిసింది.
బొల్లారం లోని మారుతినగర్ కు చెందిన నర్సింహులు (41) అనే వ్యక్తి పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. దాసరి బతికి ఉన్న సమయంలో ఆయన వద్ద 2012-2016 వరకూ సినిమాల రిస్టోరేషన్ పనులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేశాడు.
ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు మరణించిన అనంతరం కొన్ని పనులు బాకీ ఉన్నా వాటిని కూడా పలమార్ల జూబ్లీహిల్స్ లోని దాసరి ఇంటికి వెళ్లి పనులు పూర్తి చేశాడు. అయితే పనులు పూర్తి అయిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో నర్సింహులుకు , దాసరి నారాయణరావు కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్ ల మధ్య గొడవలు జరిగాయి.
అప్పటి నుంచి తనకు రావాల్సిన డబ్బుల కోసం నర్సింహులు ఆయన కుమారుడు అరుణ్ ను అడుగుతూనే ఉన్నాడు. ఈనెల 13న నర్సింహులు ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్.సీసీ వద్దకు రమ్మని అరుణ్ చెప్పాడు. దీంతో నర్సింహులు స్నేహితులతో వెళ్లగా అక్కడ దాసరి అరుణ్ కుమార్ తనను కులం పేరుతో దూషించాడని నర్సింహులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.