లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) అంటే.. ఒక చరిత్ర. ఇప్పటికీ ఆయన అంటే దర్శకుల జాతికే గర్వకారణం. పైగా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కనిపించే మొట్టమొదటి వ్యక్తి ఆయనే. తెలుగు సినిమాకి ఆయనే పెద్ద దిక్కు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు ఆయన పరిష్కారం చూపించేవారు కానీ, నేడు ఆయన ఇంట్లో సమస్యలను పట్టించుకునేవారే లేకపోవడం దురదృష్టకరం.
దాసరి నారాయణ రావు గారు మరణించిన తర్వాత వారి కుమారులు పలు వివాదాల్లో ఇరుక్కుని దాసరిగారి పరువు తీస్తున్నారు. తాజాగా ఆయన చిన్న కుమారుడు నటుడు అరుణ్ కుమార్ (Dasari arun kumar) పై ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఈ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోంది.
అయితే, కేసు పెట్టిన వ్యక్తి బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్. ఇతను మూవీ రిస్టోరేషన్ ఔట్‌సోర్సింగ్ చూసుకునే టెక్నీషియన్. 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావుగారు వద్ద పని చేశారు. అయితే, దాసరిగారు మరణించిన తర్వాత, ఆయన కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు.
అయితే, గతంలో కంటే ఎక్కువ జీతం ఇవ్వాలని బ్యాగరి నర్సింహులు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన సమయంలో దాసరి చిన్న కుమారుడు అరుణ్, ఆ ఒప్పందం పై తాను సంతకం చేయలేదని, మీరు కోరినంత డబ్బు ఇవ్వలేము అని తేల్చి చెప్పాడు.
కానీ, డబ్బు కోసం బ్యాగరి నర్సింహులు, అరుణ్ కుమార్ వెంట పడ్డాడు. ఈ నెల 13న రాత్రి అరుణ్ కుమార్ వద్దకు డబ్బు కోసం వెళ్ళినప్పుడు.. ఆయన తనను కులం పేరుతో దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని బ్యాగరి నర్సింహులు తన ఫిర్యాదులో పేర్కొంటూ కేసు పెట్టారు. ప్రస్తుతానికి ఈ కేసు పై దాసరి అరుణ్ కుమార్ ఇంకా స్పందించలేదు.