Vijayawada Flood Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం ప్రారంభం అయ్యింది. విజయవాడలోని బుడమేరుకు భారీ వరద ప్రవాహం వచ్చిందంటూ ప్రచారం నడుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత ఏడాది విజయవాడలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. బుడమేరుకు గండిపడి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రాణ నష్టం తో పాటు ఆస్తి నష్టం జరిగింది. సీఎం చంద్రబాబు వారం రోజులపాటు వరద సహాయక చర్యల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు బుడమేరుకు మరోసారి వరద ప్రవాహం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే అది పుకారు మాత్రమేనని.. బుడమేరుకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని జిల్లా అధికారులు ప్రకటించారు.
Also Read: ఏపీలో నామినేటెడ్ జాతర!
గత ఏడాది వరద బీభత్సం..
గత ఏడాది సెప్టెంబర్ లో విజయవాడలో( Vijayawada ) వరద ముంచెత్తిన విషయం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. బుడమేరు వాగుకు గండ్లు పడి వరద పోటెత్తగా.. దానికి కృష్ణ వరద కూడా తోడు కావడంతో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వారం రోజుల తర్వాత అక్కడ పరిస్థితి యథాస్థితికి వచ్చింది. అయితే నాడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రోజుల తరబడి ఇళ్లకు పరిమితం అయ్యారు. ఆహారానికి కూడా అవస్థలు పడ్డారు. మంచినీరు కూడా దొరకకుండా పోయింది. రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే నాటి పరిస్థితిని గుర్తుచేసుకొని తాజాగా జరుగుతున్న ప్రచారంతో ఆందోళనకు గురయ్యారు విజయవాడ ప్రజలు.
Also Read: ప్రస్టేషన్ లో జగన్.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్!
అధికారుల ప్రత్యేక ప్రకటన..
అయితే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలో సైతం భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. కృష్ణా( Krishna), ఎన్టీఆర్ జిల్లాల్లో సైతం విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో బుడమేరులో నీటి ప్రవాహం పెరిగింది. కానీ గండ్లు పడే స్థాయికి మాత్రం లేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో బుడమేరుకు మళ్లీ వరద అంటూ ప్రచారం ప్రారంభం అయింది. విజయవాడ నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉండే వారి బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో కృష్ణాజిల్లా అధికారులు ప్రకటన జారీచేశారు. బుడమేరుకు మళ్లీ వరదనే పుకార్లను ఎవరు నమ్మవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలు భయాందోళనలు చెందవద్దని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా బుడమేరు పరివాహక ప్రాంతాలపై నిఘా పెట్టింది. పర్యవేక్షణకు గాను అధికారులను నియమించింది.