Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది. నిన్నటితో రిమాండ్ గడువు ముగియగా, నేడు కోర్టు లో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ రిమాండ్ ప్రక్రియ ని పూర్తి చేసేందుకే అల్లు అర్జున్ నేడు కోర్టు లో హాజరైనట్టు తెలుస్తుంది. ఇటీవలే ఆయన చిక్కడిపల్లి పోలీసుల ఆదేశాల మేరకు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుమారుగా మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో అల్లు అర్జున్ పోలీసులు అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే నేడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కి కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 21 వ తారీఖు తో ఆయన బెయిల్ గడువు ముగియనుంది.
ఇది ఇలా ఉండగా రేవతి కుమారుడు శ్రీ తేజ్ కి అల్లు అర్జున్ మరియు పుష్ప టీం కలిసి ఇటీవలే రెండు కోట్ల రూపాయిల విరాళం కిమ్స్ హాస్పిటల్ వెళ్లి అందించారు. అంతే కాదు భవిష్యత్తులో శ్రీతేజ్ కుటుంబానికి ఏ చిన్న కష్టం కూడా రానివ్వకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మొదట్లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండగా, ఇప్పుడు అతని పరిస్థితి చాలా వరకు మెరుగు పడిందని తెలుస్తుంది. డాక్టర్లు వెంటిలేటర్ నుండి తొలగించి, ఆక్సిజన్ పైప్ ని కూడా తీసేసారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకొని, మామూలు మనిషి లాగా తిరుగుతాడని డాక్టర్లు బలమైన నమ్మకం తో చెప్తున్నారు. మరో పక్క శ్రీతేజ్ ని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులూ కూడా ప్రతీ రోజు కలుస్తున్నారు. రీసెంట్ గానే మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వంటి వారు కూడా శ్రీ తేజ్ ని కలిశారు.
కొంతమంది నాయకులూ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ఇంటి పై రాళ్ళ దాడి కూడా వీళ్ళే చేసినట్టు తెలుస్తుంది. అయితే శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కూడా ఈ కేసు ని త్వరలోనే వెనక్కి తీసుకుంటాను అని మీడియా ముఖంగా అధికారిక ప్రకటన చేయడంతో, అతి త్వరలోనే అల్లు అర్జున్ ఈ కేసు నుండి బయటపడే అవకాశం ఉంది. అయితే నిన్న సినీ ప్రముఖులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ ఎదుగుదల కి అవసరమయ్యే చర్చలు చేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ మీద నాకు ఎలాంటి కోపం లేదని, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్ళు నాకు చిన్నప్పటి నుండి తెలుసని, వాళ్ళ ఎదుగుదల కి ఎంతో సంతోషిస్తున్నాని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.