Brahmanandam : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. మంచి స్టోరీ లైన్ ని డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) సరిగా తీయలేకపోయాడు అని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు సినిమా మొత్తం ఒక అతుకుల బొంత లాగా అనిపించింది. సన్నివేశాలకు మధ్య లింక్ కనిపించదు. అలా ఫాస్ట్ గా స్క్రీన్ ప్లే పరుగులు తీస్తూ ఉంటుంది, ఒక్కటంటే ఒక్క వావ్ మూమెంట్స్ కూడా ఈ సినిమాలో లేవు. సినిమాకి ఎంతో ప్లస్ అయినటువంటి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాన్ని చాలా తొందరగా ముగించేయడం అభిమానుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. అయితే డైరెక్టర్ శంకర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేసరికి 5 గంటల ఫుటేజీ వచ్చిందని, ఎడిటింగ్ లో ఎన్నో సన్నివేశాలు తొలగించామని, నాకు కూడా ఈ చిత్రం సంతృప్తి ఇవ్వలేదంటూ ఒక తమిళ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
దాదాపుగా మూడు సినిమాల ఫుటేజీ ని శంకర్ తెరకెక్కించాడు. అంటే ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ స్క్రిప్ట్ లేకుండా, ఎలా పడితే అలా సన్నివేశాలు తీసుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట. అందుకే నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ సినిమా ఫలితం పై అంత అసంతృప్తి తో ఉన్నాడు. ఆయనతో అనవసరమైన ఖర్చు మొత్తం పెట్టించాడు డైరెక్టర్ శంకర్. దిల్ రాజుకి ఫ్లాప్స్ కొత్తేమి కాదు, కానీ ఈ సినిమా ఫ్లాప్ ని మాత్రం ఆయన చాలా సీరియస్ గా మనసుకి తీసుకున్నాడు. విడుదల తర్వాత ఒక్క చోట కూడా ఈ సినిమా గురించి మాట్లాడేందుకు ఆయన ఇష్టపడకపోవడాన్ని చూస్తుంటే ఆయనలో ఏ స్థాయి అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రంలో బ్రహ్మానందం(Bramhanandam) కేవలం ఒక్క సన్నివేశంలో అలా తళుక్కుమని మెరిసి మాయమైపోతాడు, మళ్ళీ ఏ సన్నివేశం లో కూడా కనిపించడు.
రీసెంట్ గా ఆయన నటించిన ‘బ్రహ్మా ఆనందం’ చిత్రం విడుదల సందర్భంగా, ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈమధ్య కాలం లో మీరు గేమ్ చేంజర్ చిత్రంలో నటించారు. చాలా తక్కువ సమయంలో కనిపించడం మాకు అసంతృప్తి గా అనిపించింది’ అని అడగగా, దానికి బ్రహ్మానందం సమాధానం చెప్తూ ‘నేను ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేశాను. మీరు చూసింది చిన్న రోల్ అంతే’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే నా సన్నివేశాలు మొత్తం ఎడిటింగ్ లో లేపేశారు అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఇలా ‘గేమ్ చేంజర్’ గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు. డైరెక్టర్ శంకర్ పైత్యం కారణంగా రామ్ చరణ్ కి మూడేళ్ళ విలువైన కాలం నష్టం కాగా, దిల్ రాజు కి 300 కోట్ల రూపాయిల బడ్జెట్ నష్టమైంది. సమయానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆదుకోవడం వల్ల దిల్ రాజు ఇలా ఉన్నాడు కానీ, లేకపోతే ఆయన చరిత్ర గా మిగిలిపోయేవాడు.