Salman Khan: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యమంత్రుల నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యేల వరకు ఎన్నికల ప్రచారంలో తల మునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం కొన్ని గంటలపాటు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎన్నికలు ఉన్నప్పటికీ.. ప్రచారానికి కొద్దిసేపు విరామం ఇచ్చి ఆయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశారు. వీరిద్దరి భేటీ బాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి భేటీకి కారణం లేకపోలేదు.
ముంబైలో సల్మాన్ ఖాన్ బాంద్రా ప్రాంతంలో నివసిస్తారు. అయితే ఆయన నివాసం వెలుపల ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడ కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.. మంగళవారం సల్మాన్ ఖాన్ ను ఆయన నివాసంలో కలిశారు. ఇద్దరు ఏకాంతంగా భేటీ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. వీటి అనంతరం ఏక్ నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ” దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అండర్ వరల్డ్ కు స్థానం లేదు. ఇకపై ఎవరూ అలాంటి పని చేసేందుకు మేము ఒప్పుకునేది లేదు. ఎవరైనా అలాంటి పని చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆదివారం నాటి కాల్పులకు కారణమైన వ్యక్తులను వదిలిపెట్టం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పని పూర్తి చేస్తాం. కాల్పులు జరిగిన నేపథ్యంలో బాంద్రా లోని సల్మాన్ ఖాన్ ఇంటి బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించాను. సల్మాన్ ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ముంబైలో ఇకపై ఎవరూ కాల్పులకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని” షిండే ప్రకటించారు.
కాగా, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ నివాసముండే గెలాక్సీ అపార్ట్మెంట్స్ వెలుపల బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ లో ఒక వ్యక్తి సల్మాన్ ఖాన్ ఇంటివైపు కాల్పులు జరుపుతున్నట్టు కనిపించింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో ముంబైలో కలకలం నెలకొంది. అయితే ఇది గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఆ నిందితుల ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనకు పాల్పడిన ఓ వ్యక్తి తండ్రిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కాల్పుల ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలపై గట్టిగా నిఘా పెట్టారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నించి వదిలేస్తున్నారు.