T20 World Cup 2024: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన పొరపాటున పునరావృతం కాకుండా చూడాలని టీమిండియా భావిస్తోంది.. టెస్ట్, వన్డే, టీ- 20 ల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ.. 2011 తర్వాత ఇంతవరకు ఐసీసీ నిర్వహించిన ఏ మెగా టోర్నీని కూడా టీమిండియా దక్కించుకోలేకపోతోంది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. పెద్ద పెద్ద బ్యాటర్లు ఉన్నప్పటికీ ఒత్తిడిలో చిత్తయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ లో ఆ తప్పును పునరావృతం చేయొద్దని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే టీ – 20 వరల్డ్ కప్ కు సంబంధించి బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీమిండియా త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. బ్యాటింగ్ ద్యయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ని ఓపెనర్లుగా పంపేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అంతేకాదు ఐపీఎల్లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తేనే హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఆ సంకేతాలను అతనికి బీసీసీఐ సెలెక్టర్లు పంపినట్టు తెలుస్తోంది. అంతేకాదు గత వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బ్యాటర్ గా వెళ్లిన గిల్ ను ఈసారి బ్యాక్అప్ ఓపెనర్ గా ఉంటాడని సమాచారం. రాజస్థాన్ జట్టులో ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్న రియాన్ పరాగ్ ను టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రాకు తోడుగా మయాంక్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగం లోనూ సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ వంటి సీనియర్లనే కాకుండా ఐపీఎల్లో సత్తాచాటుతున్న యువకులకు కూడా ఈ సిరీస్ లో బీసీసీఐ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మాయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు ఐపీఎల్లో అదరగొడుతున్నారు. అయితే వీరిలో ఎవరికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.