హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ ధ్రువతారను కోల్పోయింది. అవెంజర్స్, బ్లాంక్ పాంథర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో హీరోగా నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చాద్విక్ బోస్‌మన్‌ను క్యాన్సర్ కబలించింది. కొంతకాలంగా ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్న ఆయన లాస్ ఏంజెలెస్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బోస్‌మన్ క్యాన్సర్ బారిన పడినట్టు 2016లో గుర్తించారు. అప్పటికే కొలన్ క్యాన్సర్ మూడో దశలో ఉంది. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు చికిత్స పొందారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే ఈ నాలుగేళ్లలో చాద్విక్ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
Also Read: పవన్ బర్త్‌డే స్పెషల్… ఓ సర్ప్రైజ్, ఓ సస్పెన్స్
12 ఏళ్ల సినీ ప్రస్థానంలో బోస్‌మన్ 11 సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలు, సిరీస్‌ల్లో కూడా నటించారు. 2016లో వచ్చిన కెప్టెన్ అమెరికాతో స్టార్గా మారిన చాద్విక్ కెరీర్లో బ్లాక్ పాంథర్ మూవీ ఓ మైలురాయిగా నిలిచింది. 2018లో రిలీజైన ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు 2018లో అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అదే ఏడాది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, గతేడాది వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలతో బోస్‌మన్ పేరు మార్మోగిపోయింది. అవెంజర్స్ సిరీస్ మూవీస్ భారీ వసూళ్లు రాబట్టాయి. దాంతో నల్ల జాతీయుడైన తొలి సూపర్ హీరోగా చాడ్విక్ హాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు.
Also Read: నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘లవ్ స్టోరీ’ టీమ్
బోస్‌మన్ చివరగా ద 5 బ్లడ్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ మూవీ ఈ ఏడాదే రిలీజవగా… ‘మ రైనీస్ బ్లాక్ బాటమ్’ ఆయన నటించిన చివరి చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా, బోస్‌మన్ మరణవార్తతో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. హాలీవుడ్ ప్రముఖ నటీనటులతో పాటు బాలీవుడ్ నుంచి కూడా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం వ్యక్తం చేశారు.