Bigg Boss OTT: బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఎక్కడో బ్రిటన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షో ఇండియాలో బిగ్ బాస్ గా ప్రాచుర్యం పొందింది. బిగ్ బ్రదర్ షో విన్నర్ గా శిల్పా శెట్టి నిలిచింది. మొదట హిందీలో బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యింది. మెల్లగా అది ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులో 2017లో మొదలైంది. ఎన్టీఆర్ హోస్ట్ గా ఫస్ట్ సీజన్ ప్రసారమైంది. సీజన్ 2కి హీరో నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆయన కూడా తప్పుకున్నాక నాగార్జున ఆ బాధ్యత తీసుకున్నారు.
గత ఐదు సీజన్స్ నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా సాగుతుంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్నారు. హోస్ట్ గా సల్మాన్ ఖాన్ రికార్డు ఎవరూ చెరిపివేయలేనిది. కాగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరిగాక ఓటీటీ వెర్షన్ కూడా ప్రసారం చేస్తున్నారు. హిందీలో ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ గా ముగిశాయి.
బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ కి కరణ్ జోహార్ హోస్టింగ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం జియో సినిమాలో సీజన్ 1 ప్రసారం అయ్యింది. దివ్య అగర్వాల్ విన్నర్ గా నిలిచింది. సీజన్ 2కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. 2023లో ముగిసిన సీజన్ 2 విన్నర్ గా ఎల్విస్ యాదవ్ నిలిచాడు. కాగా సీజన్ 3కి రంగం సిద్ధం కాగా అధికారికంగా డేట్ ప్రకటించారు. బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్ 3 జూన్ నుండి స్టార్ట్ కానుందట. ఇది బిగ్ బాస్ లవర్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు.
ఓటీటీ వెర్షన్ మరింత స్పైసీ కంటెంట్ తో సాగుతుంది. టెలివిజన్ తో పోల్చుకుంటే సెన్సార్ నిబంధనలు తక్కువ. కాబట్టి ప్రేక్షకులు కోరుకునే స్పైసీ, కాంట్రవర్సీ కంటెంట్ కి కొదవ ఉండదు. అందుకే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్స్ కొందరు ఇష్టంగా చూస్తారు. అయితే సీజన్ 3కి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు సమాచారం ఉండగా… బాధ్యతల నుండి తప్పుకోవచ్చని అంటున్నారు. అనిల్ కపూర్ హోస్ట్ గా చేసే అవకాశం కలదంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.