Bigg Boss 5 Telugu Nominations: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్ యమ రంజుగా సాగింది. దాదాపు 19 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు హోస్ట్ కింగ్ నాగార్జున. తొలి వారం బూతు భామ సరయు అనూహ్యంగా హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. అయితే హౌస్ లో గొడవలు, కొట్లాటలు, విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు.
రెండో వారం 18 మంది మిగలగా సోమవారం నామినేషన్ ప్రక్రియ రచ్చరచ్చ అయ్యింది. 18 మంది కంటెస్టెంట్లను వోల్ఫ్, ఈగల్ గ్రూపులుగా బిగ్ బాస్ విభజించారు. విడిపోయిన ఇంటి సభ్యులంతా ఒకరినొకరు నామినేషన్ చేసుకునే విధానం శృతి మించింది. రంగులు ముఖానికి పూసి నామినేట్ చేసే ఈ విధానం వివాదాస్పదమైంది.
ముఖ్యంగా కంటెస్టెంట్లు ఉమ, శ్వేతవర్మ రెచ్చిపోయి బూతులు, కోపంతో ఊగిపోయారు. ఉమ బూతు మాటలు మాట్లాడగా.. శ్వేత రెచ్చిపోయి తిట్టి పోసి హమీదా,లోబోపై రంగుతో దాడి చేసినంత పనిచేసింది. వాదోపవాదాలతో తిట్లు, విమర్శలతో నామినేషన్ ప్రక్రియ రచ్చరచ్చ అయ్యింది. శ్వేత వర్మ, ఉమాదేవి, అని మాస్టర్, లోబో తదితరులు తీవ్రంగా విరుచుకుపడి నామినేట్ చేశారు.
చివరగా వోల్ఫ్ టీం నుంచి శ్వేతవర్మ, ఉమాదేవి, నటరాజ్, కాజల్ నామినేట్ కాగా.. ఈగల్ టీం నుంచి లోబో, ప్రియాంక, అని మాస్టర్ లు రెండో వారంలో నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో అందరికంటే వివాదాస్పదంగా వ్యవహరించింది ఉమాదేవీ, శ్వేతావర్మలు.
ఈ ఏడుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం తేలనుంది. అయితే హౌస్ లోనే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తూ అందరితో గొడవలు పెట్టుకొని.. బూతులతో రెచ్చిపోతున్న సీనియర్ నటి ‘ఉమాదేవి ’ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె నామినేషన్ సందర్భంగా వాడిన బూతు పదంపై చాలా మంది కంటెస్టెంట్లు, ప్రేక్షకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సరయు సైతం బూతులు మాట్లాడినందుకే తొలివారం ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు ఉమాదేవి కూడా ట్రెండ్ ను చూస్తుంటే రెండో వారం ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు.