Ram Gopal Varma: టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఎట్టకేలకు హైకోర్టులో ఊరట దక్కింది. వైసిపి ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోయేవారు రామ్ గోపాల్ వర్మ. ఒకవైపు అనుకూలంగా సినిమాలు తీస్తూనే.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు సోషల్ మీడియా ద్వారా. జగన్ రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని వ్యూహం అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు,లోకేష్, పవన్ కళ్యాణ్ పై పెట్టిన పోస్టులు పెను దుమారానికి దారి తీసాయి. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో ఒకరు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టిన పోలీసులు నోటీసులు అందించారు. అయితే విచారణకు వస్తే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని రామ్ గోపాల్ వర్మ అనుమానం వ్యక్తం చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయితే దానిపై పలుమార్లు విచారణ చేపట్టిన కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. కానీ ఈరోజు విచారణలో మాత్రం రాంగోపాల్ వర్మ కు అనుకూల తీర్పు వచ్చింది. వాస్తవానికి తొలుత క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు కొట్టి వేసింది. అవసరమైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అయితే బెయిల్ పిటిషన్ విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈరోజు కీలకతీర్పు ఇచ్చింది కోర్ట్. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
* కొద్దిరోజులుగా హల్ చల్
ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆయన పై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీసానో వారు స్పందించడం లేదని వెటకారం చేశారు. రాష్ట్రంలో ఏకకాలంలో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ ప్రశ్నించారు. పోలీసులకు సైతం సవాల్ విసిరేలా మాట్లాడారు. ఇంకోవైపు తన గురించి పోలీసులు వెతుకుతుండగా స్టూడియోలకు వచ్చి టీవీలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే రాంగోపాల్ వర్మ విషయంలో పోలీసుల తీరు సైతం అనుమానాలకు తావిచ్చింది.
* ఎలా స్పందిస్తారో
అయితే కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో రాంగోపాల్ వర్మ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలురాసుకుంటానని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లలేదా? జగన్ జైలుకు వెళ్లలేదా? రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లలేదా? వారందరి మాదిరిగానే తాను జైలుకు వెళ్తానని వెటకారంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.