తాజాగా బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కొవిడ్ బాధితుల బాధల గురించి మాట్లాడుతూ.. ‘ఈ కష్ట సమయంలో నలిగిపోతున్న వారికి అండగా నిలబడి, సాయమందించడం మన అందరి బాధ్యత’ అంటూ భూమి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు విషయాలను చెప్పుకొచ్చింది. భూమి మాటల్లోనే ‘నా ఫ్యామిలీ కూడా ఈ భయంకరమైన మహమ్మారితో పోరాడింది.
కరోనా సోకి నా తల్లి పడిన కష్టాన్ని బాధను నేను చూశాను. నా పేరెంట్స్ బాధను చూసిన తరువాత, అలా మరొకరు బాధ పడకూడదు అని నేను నా వంతుగా సాధ్యమైనంత మందికి సహాయపడాలని నిర్ణయించుకుని సాయం అందిస్తున్నాను. ప్రస్తుతం ఐసీయూ బెడ్స్ కోసం, ఆక్సిజన్ల కోసం రోజూ మాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. మా వలంటీర్లు వారికి సాయం చేయడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం.
ఈ క్రమంలో కష్టాల్లో మునిగిపోయిన పేదవారిని, వారి హృదయ విదారకరమైన పరిస్థితుల్ని చూసి ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. దీనికితోడు స్వచ్ఛంద సేవకులు దోపిడీకి గురికావడం చూశా. సాయం పక్కదారి పడుతుంది. ఎవరికైనా ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల గురించి తెలిస్తే పోలీసులకు రిపోర్ట్ చేయండి’ అంటూ భూమి అందర్నీ అప్రమత్తం చేసింది.