Bheemla Nayak in Japan: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో పవన్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనులవిందు చేస్తున్నాయి. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లలో విజిల్స్ వేయిస్తోంది.
భీమ్లానాయక్ మేనియా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాలేదండోయ్. ఎందుకంటే మన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్ కలెక్షన్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేయగా.. తాజాగా జపాన్‌లో పవన్ కళ్యాణ్ తరహాలో అభిమానులు డ్యాన్సులు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసి జపాన్‌లోనూ భీమ్లా నాయక్ మేనియా కొనసాగుతోందని పవర్‌స్టార్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో తెగ వీడియోలు పోస్ట్ చేయడం చూశాం. ఇప్పుడు భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులను వేస్తూ జపాన్‌లోని ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 170 కోట్లు వసూలు చేసింది. రూ. 200 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది.
ఏపీలో టికెట్ ధరలు ఈ సినిమా కలెక్షన్‌లపై ప్రభావం చూపించాయి. లేకపోతే ఇప్పటికే ఈ చిత్రం రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టేది. అజిత్ కుమార్, వాలిమై, అలియా భట్ గంగూబాయి కతియావాడిలతో పాటు రిలీజైనా పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చూపించాడు. కాగా మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కింది. మాటలు, స్క్రీన్‌ప్లేను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించడంతో డైలాగులు బుల్లెట్లలా పేలాయని అందరూ చర్చించుకుంటున్నారు.