Bheemla Nayak Controversy: పవన్ కల్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పవన్ కల్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జతగా సంయుక్త మీనన్ నటించారు. ఇందులో ఎవరికి వారు పోటీపడి నటించి తమ ప్రతిభకు పదును పెట్టారని తెలుస్తోంది. క్లైమాక్స్ లో సంయుక్త నటనకు అందరు ఫిదా అవుతున్నారు. పవన్ కల్యాణ్ నటనకు ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే వంద కోట్లు దాటినట్లు లెక్కలు చెబుతున్నాయి.
సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు వివాదం నెలకొన్నా తరువాత సమసిపోయింది. కానీ ప్రస్తుతం మరో వివాదం తెర మీదకు వచ్చింది. చిత్రంలో రానా ఓ సన్నివేశంలో చక్రంను తన్నడం ఉండటంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కుమ్మరి కులం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ బతుకు చక్రం కావడంతో దాన్ని తన్ని అవమానించారని ఆరోపణలు చేశారు. చిత్రం యూనిట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో శాలివాహన కులస్తుల డిమాండ్ నేపథ్యంలో భీమ్లానాయక్ పై కూడా ఫిర్యాదు రావడంతో చిత్రం యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డారు. చిన్న విషయంపై కూడా వివాదాలు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉందోననే సంశయాలు వ్యక్తం చేయడం గమనార్హం.
ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న సన్నివేశం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాము పవిత్రంగా భావించే చక్రాన్ని తన్నడం సమంజసం కాదని ఆరోపిస్తున్నారు. చిత్రం యూనిట్ దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.