
బండ్ల గణేష్ ఒక కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పుడు నలుగురిలో ఒకరిగా ఉండేవాడు. కానీ.. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ తో సినిమా తీసి నిర్మాతగా మారాడో.. ఒక్కసారిగా అతని రేంజ్ మారిపోయింది. తనదైన స్పెషల్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. తొలి మూవీ ‘తీన్మార్’ నిరాశ మిగిల్చినా.. మళ్లీ పవన్ తో ‘గబ్బర్ సింగ్’ మూవీ చేసి ఇండస్ట్రీ దద్దరిల్లిపోయే హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత కూడా నిర్మాతగా జోరు కొనసాగించాడు. స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు తీశాడు. అయితే.. సక్సెస్ ను ఎక్కువగా కాలం కొనసాగించలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్-పూరీ జగన్నాథ్ తో తీసిన టెంపర్ చిత్రం తర్వాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నాడు బండ్ల. అయితే.. మధ్యలో పాలిటిక్స్ తో కాస్త హడావిడి చేశాడు. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేశాడు.
ఇంటర్వ్యూలలోనూ, సినిమా ఫంక్షన్లలోనూ తనదైన రీతిలో మాట్లాడే బండ్ల గణేష్.. ఎవరు ఏమనుకుంటారో అన్నది పట్టించుకోడు. తాను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అలాంటి గణేష్ ఉన్నట్టుండి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను ట్విటర్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. తన అకౌంట్ ను క్లోజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

‘‘త్వరలో ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా.. నా జీవితంలో ఎలాంటి వివాదాస్పద అంశాలకు చోటు ఇవ్వదలుచుకోలేదు’’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఇది చూసిన వారంతా.. ఏమైందని కామెంట్లు పెడుతున్నారు. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటని చర్చించుకుంటున్నారు. ఆ మధ్య శిరీష బండ్ల అనే యువతి స్పేస్ టూర్లోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు.. ‘‘మా బండ్ల అమ్మాయి’’ అని పోస్టు చేశాడు. ఆ సమయంలో కొందరు సెటైర్లు వేశారు. మరి, దానికి ఏమైనా గణేష్ హర్ట్ అయ్యాడా? లేక కారణం మరేదైనా ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.