Bandla Ganesh : బండ్ల గణేష్..ఈయన ఎవరిని ఎప్పుడు పొగుడుతాడో, ఎప్పుడు తిడుతాడో ఎవరికీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ పేరు చూస్తేనే ఒకప్పుడు ఊగిపోయేవాడు, శివుడికి నంది, పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ అంటూ ప్రసంగాలు ఇచ్చేవాడు. కానీ ఎన్నికల ముందు కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ పై అలక ప్రదర్శించాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనని మా దేవుడిని కలిసేందుకు అడ్డుకుంటున్నాడని, నన్ను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ట్విట్టర్ లో అభిమానుల సమక్షం లో ఎన్నోసార్లు వాపోయాడు. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలంటూ ఒక అభిమాని బండ్ల గణేష్ కి ఫోన్ చేసి పిలవగా, నాకు రావాలనే ఉంటుంది, కానీ త్రివిక్రమ్ నన్ను రానివ్వడం లేదు, భీమ్లా నాయక్ సినిమాకి ఏదైనా తేడా జరగాలి అప్పుడు చెప్తా వాడి సంగతి అంటూ త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్.
స్నేహితుడి మాటలను విని నన్ను దూరం పెడుతున్నాడు అని పవన్ కళ్యాణ్ పైన కూడా పరోక్షంగా ఆయన పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసాడు. అయితే సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు, నిర్మాత బండ్ల గణేష్ కూడా పాల్గొన్నాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ‘హిందువులకు భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్. క్రిస్టియన్స్ కి బైబిల్ ఎలాగో, పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ అలాగ’ అంటూ తన మార్కు డైలాగ్స్ వదిలాడు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో త్రివిక్రమ్ మీద చేసిన కామెంట్స్ పై ఒక విలేఖరి బండ్ల గణేష్ ని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘అప్పుడు నేను వేరే మూడ్ లో ఉండడం వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘పదేళ్లు ఆయన ఈ రాజకీయ రణరంగంలో పోట్లాడి నేడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు. ఆయన ఒక నిబద్దత, నిజాయితీ కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరకి వెళ్లి రికమెండేషన్ మీద వెళ్ళాలి, దగ్గరకి వెళ్ళాలి అంటే గు** మీద తంతాడు’ అంటూ విలేఖరుల సమావేశం లో బండ్ల గణేష్ బూతులు మాట్లాడాడు. ఇకపోతే సెప్టెంబర్ రెండవ తారీఖున విడుదల అవ్వబోతున్న గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకి ఉన్న ఊపుని చూస్తుంటే, కచ్చితంగా మొదటిరోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు, చూడాలి మరి.