Balakrishna : నిన్నటి తరం హీరోలలో లెజెండ్ ఎవరు అనే దానిపై ఒకప్పుడు పెద్ద చర్చనే నడిచింది. ఈ అంశంపై బాలకృష్ణ ఇటీవల జరిగిన ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో ప్రస్తావించాడు. జనవరి 12న ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీం మొత్తం ఈ ఎపిసోడ్ లో పాల్గొనగా, బాలయ్య వాళ్ళతో చేసిన సరదా చిట్ చాట్ ఆడియన్స్ ని బాగా అలరించింది. ఈ సంభాషణలో ఆయన గతం లో ‘వజ్రోత్సవం’ వేడుక లో చిరంజీవి, మోహన్ బాబు మధ్య జరిగిన వివాదం గురించి ప్రస్తావించాడు. అప్పట్లో ఒక పెద్ద ఫంక్షన్ లో ఇద్దరు హీరోలు నేను లెజెండ్ అంటే నేను లెజెండ్ అంటూ కొట్టుకున్నారు. వాళ్ళ పేర్లను నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో ఎవరు లెజెండ్ అని అనుకుంటున్నారు అంటూ బాలయ్య డైరెక్టర్ బాబీ, తమన్ మరియు నాగవంశీ కి ప్రశ్న వేస్తాడు.
అయితే దీనిపై వాళ్ళు సమాధానం చెప్పడానికి భయపడగా, బాలయ్య మాట్లాడుతూ ’50 సంవత్సరాలు జనాలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. దానికి గుర్తుగా మొన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ నన్ను సత్కరించింది. ఇక్కడే తెలిసిపోతుంది కదా, ఎవరు అసలు సిసలు లెజెండ్ అనేది. పౌరాణికం, సాంఘికం, మాస్, క్లాస్, లవ్ స్టోరీస్ ఇలా నేను ముట్టుకొని జానర్ అంటూ ఏది మిగలలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య. ఆయన మాట్లాడిన మాటలను నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఇది మా బాలయ్య అంటే అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియా లో బాలయ్య ని ఇష్టపడని వాళ్ళు, తనకి తాను గొప్పలు చెప్పుకోవడంలో బాలయ్య మోహన్ బాబు ని మించిపోయాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ పై ఫుల్ ఫైర్ మీద ఉన్న సంగతి తెలిసిందే.
తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించే సమయం వచ్చినప్పుడు బాలయ్య ప్రస్తావించకుండా అవమానించాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున రచ్చ చేసారు. వీళ్ళ మధ్య సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం జనవరి 12 న విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య నుండి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఊహించలేదంటూ సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ ని చూస్తే రెగ్యులర్ బాలయ్య సినిమాలాగా అనిపించలేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.