Allu Arjun : తెలంగాణలో గత కొద్దీ రోజులుగా జరుగుతున్న ఘటనలను చూసి ప్రజలకు శాంతి భద్రతలపై భయం కలిగించే విధంగా ఉన్నాయి. దురదృష్టం కొద్దీ డిసెంబర్ నాల్గవ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో లో రేవతి అనే మహిళ తొక్కిసిలాట ఘటనలో మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండడం, దీనిపై తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు చాలా ఘాటుగా స్పందించి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి తరలించడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకి రావడం వంటి సంఘటనలు గత రెండు వారాలుగా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యం లో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీ లో ఈ ఘటనపై చాలా ఘాటుగా స్పందించడం, ఆరోజు సాయంత్రం సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వంటివి జరిగాయి.
అయితే అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి, శ్రీ తేజ్ కి అండగా ఉంటానని, వాళ్లకు ఆర్ధికసాయం కూడా అందిస్తానని మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పాడు. అయినప్పటికీ కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి పై రాళ్ళ దాడి జరిగి, అతని ఇంట్లోకి చొరబడి పూల కుండీలను ద్వంసం చేయడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన నిందితుల పేర్లను రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించిన పోలీసులు, వాళ్ళని అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2),131 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసారు. అయితే వీళ్లంతా నేడు బెయిల్ మీద విడుదల కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పైగా వీళ్లకు ఎలాంటి షరతులు లేని బైలుని మంజూరు చేశారట. దీని పై అల్లు అర్జున్ అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా ద్వారా నిరసన తెలియచేస్తున్నారు. ప్రత్యక్షంగా దాడికి పాల్పడిన వారికి ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ ని మంజూరు చేయడం ఏమిటి ?, దురదృష్టకర సంఘటనకు అల్లు అర్జున్ ఒక్కడిని బాద్యుడిని చేసి అరెస్ట్ చేయడం ఏమిటి?, పైగా అతనికి రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వలేదు, కేవలం ఇంటెర్మ్ బెయిల్ ని మాత్రమే మంజూరు చేసారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా వదలకుండా, రాత్రి మొత్తం జైలు లోనే పెట్టుకొని పంపించారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నాడని, మా అల్లు అర్జున్ ఏమి పాపం చేశాడంటూ అభిమానులు సోషల్ మీడియా లో రోదిస్తున్నారు.