Megastar Chiranjeevi: 90లలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, అలీ స్టార్ కమెడియన్స్. వీరు దాదాపు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు. కోటా-బాబు మోహన్ లది హిట్ కాంబినేషన్. పదుల సంఖ్యలో కామెడీ ట్రాక్స్ చేశారు. స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా ఉన్న బాబు మోహన్ క్షణం తీరిక లేకుండా చిత్రాలు చేసేవాడట. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అతని కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని బాబు మోహన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 1993లో విడుదలైన ముఠా మేస్త్రి చిరంజీవి బ్లాక్ బస్టర్స్ లో ఒకటి.
ఈ మూవీలో బాబు మోహన్ విలన్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు. ఓ సన్నివేశం బాబు మోహన్ పై చేయాల్సి ఉండగా చిరంజీవి మూడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చిందట. విసుగెత్తిపోయిన చిరంజీవి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు… ఒకటి రెండు రోజుల్లో ఆ సీన్ పూర్తి చేయాలి అన్నారట. మీరు ఏదో ఒక టైం చెబితే రావడానికి ప్రయత్నం చేస్తాను, అని బాబు మోహన్ అన్నారట. ఇంకా ప్రయత్నం చేయడం ఏమిటీ? అని చిరంజీవి సీరియస్ అయ్యారట. బాబు మోహన్ సారీ చెప్పారట.
ఒకరోజు వీలు చేసుకుని సారథి స్టూడియోకి బాబు మోహన్ వెళ్లారట. అప్పటికే సెట్స్ లో చిరంజీవి ఉన్నారట. బాబు మోహన్ కళ్ళు చూసి చిరంజీవి… షూటింగ్ నుండి వచ్చావా? నటుల జీవితాలు ఇంతే అన్నారట. చిరంజీవి ఇంటి నుండి దోశలు తెప్పించి పెట్టాడట. బాబు మోహన్ ఆవురావురుమని తింటుంటే చిరంజీవి… నేను కూడా ఇక్కడే తినేవాడిని, హీరోని కదా అందుకే తినడం లేదు అన్నాడట.
చిరంజీవి అంటే నాకు ప్రాణం. డేట్స్ అడ్జెస్ట్ కాక అలా జరిగింది… అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. బాబు మోహన్ డబ్బులు ఎక్కడపడితే అక్కడ పెట్టేవాడట. ఒకరోజు బెడ్ షీట్ తీస్తే రూ. 12 లక్షలు బయటపడ్డాయట. తన మేనేజర్ కోటి రూపాయలు మోసం చేశాడట. అప్పటి నుండి తన వ్యవహారాలు తానే చూసుకునేవాడట. చాలా మంది డబ్బులు ఎగ్గొట్టారట. పలుమార్లు చెక్స్ బౌన్స్ అయ్యాయని బాబు మోహన్ అన్నారు.