https://oktelugu.com/

Hanuman: హను మాన్ కి టైం కూడా కలిసొచ్చిందా?

జనవరి 22వ తారీఖున అయోధ్య లో నిర్మించిన ఆలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Written By: , Updated On : January 14, 2024 / 10:52 AM IST
Hanuman

Hanuman

Follow us on

Hanuman: చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన హీరో.. విభిన్న చిత్రాలు తీస్తాడని పేరు పొందిన డైరెక్టర్.. 30 కోట్లకు మించి ఖర్చు పెట్టలేని నిర్మాత.. ఏ పాత్రనైనా సరే అవలీలగా చేయగలిగే క్యారెక్టర్ నటుడు.. ఎటువంటి నేపథ్యమైనా దున్నేసే సత్తా ఉన్న నటి.. జబర్దస్త్ ద్వారా బుల్లితెర కమల్ హాసన్ గా పేరుపొందిన నటుడు.. ఒకటి, అరా చిత్రాల్లో మెరిసిన ఓ కథానాయక. ఇదీ స్థూలంగా హనుమాన్ చిత్రం గురించి చెప్పాలి అంటే.. కానీ ఆ చిత్రంలో అంతకుమించి ఉన్నాయి. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా పెను సంచలనానికి దారి తీస్తోంది. లార్జెర్ దెన్ లైఫ్ లాగా ఈ చిత్రంలో అన్నింటికంటే మించి హనుమంతుడు ఉన్నాడు. అతడి సూపర్ మాన్ పవర్ ఉంది. హిందూ మైథాలజీ ఉంది. దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఉద్భవిస్తాడో చెప్పే నేపథ్యం, చెడు ఎప్పుడూ చేటు చేస్తుంది అని వివరించే కథా కథనమూ ఈ సినిమాలో ఉంది.. అయితే ఇప్పుడు ఈ సినిమాకు రాముడు కూడా తోడయ్యాడు.

జనవరి 22వ తారీఖున అయోధ్య లో నిర్మించిన ఆలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఫలితంగా అయోధ్యా నగరి వార్తల్లో అంశమైంది. దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్య నగరికి కానుకలు పంపిస్తున్నారు.. గుడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అయోధ్య నగరి లో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో అది హనుమాన్ సినిమాకు కలిసి వచ్చింది. హనుమంతుడు హిందువుల ఆరాధ్య దైవం కాబట్టి.. ఈ సినిమాను చూసేందుకు హనుమంతుడి భక్తులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిత్ర యూనిట్ కూడా హనుమాన్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడంతో భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ఈ సినిమా భారీగానే వసూళ్లు సాధిస్తున్నది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే నార్త్ ఇండియాలో విస్తృతంగా పర్యటించింది. అయోధ్యలో కూడా పర్యటించింది. రాముడు నడయాడిన ప్రాంతాల్లోనూ సినిమా గురించి భారీగా ప్రచారం చేసింది. నార్త్ మార్కెట్లో ప్రస్తుతానికి భారీ చిత్రాలు లేకపోవడం.. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యం.. వరుస సెలవులు.. ఈ నేపథ్యంలోనే హనుమాన్ సినిమా విడుదల కావడం.. ఇన్ని సానుకూల అంశాలతో ఈ చిత్రం భారీ వసూళ్ళు దక్కించుకుంటున్నది.

ఇక తెలుగులోనూ సరైన థియేటర్లు దక్కకపోయినప్పటికీ మౌత్ పబ్లిసిటీ తో.. దక్కిన ఆ కాస్త థియేటర్లలో భారీగా కలెక్షన్లు తగ్గించుకుంటున్నది. ఓ అగ్ర హీరో సినిమాతో పాటు విడుదలైన ఈ చిత్రం బుక్ మై షో లో ఏకంగా 9.8 రేటింగ్ సాధించడం విశేషం. ఐఎండీబీ కూడా ఈ సినిమాకు దాదాపు తొమ్మిది వరకు రేటింగ్ ఇవ్వడం విశేషం. వరుస సెలవులు, హనుమంతుడి నేపథ్యం, అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. ఇన్ని అనుకూల పరిణామాలు హనుమాన్ సినిమాకు భారీ వసూళ్లు దక్కేలా చేస్తున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలయ్యాయని, వాటిని ప్రేక్షకులు అంతంతమాత్రంగానే ఆదరిస్తున్నారు కాబట్టి.. హనుమాన్ సినిమాకి మరిన్ని కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి అయోధ్య మేనియా హనుమాన్ సినిమాకి కలిసి వచ్చిందని వారు చెబుతున్నారు. జనవరి 22న రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అప్పటివరకు ఈ సినిమా గురించి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే ఉంటుందని సినీ ట్రేడ్ పండితులు అంటున్నారు.