Tollywood, Ap Govt : సర్కార్ టికెట్లు: సినిమాలు నిర్మాతలవి.. కలెక్షన్లు ఏపీ ప్రభుత్వానివా?

Tollywood, Ap Govt : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలిసిందే. కేవలం ఆ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద సినిమా ఒక్క‌టి కూడా రిలీజ్ కాలేదు. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది టికెట్ రేట్ల త‌గ్గింపు. వ‌కీల్ సాబ్ సినిమా స‌మ‌యంలో త‌గ్గించిన రేట్ల‌తో ఇండ‌స్ట్రీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ స‌మ‌స్య ఎప్పుడు ప‌రిష్కార‌మ‌వుతుందా? అని ఇండ‌స్ట్రీ ఆశ‌గాఎదురు చూస్తోంది. సీఎం జ‌గ‌న్ తో స‌మావేశానికి ఆహ్వానం అంద‌డంతో.. […]

Written By: Bhaskar, Updated On : September 9, 2021 2:59 pm
Follow us on

Tollywood, Ap Govt : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలిసిందే. కేవలం ఆ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద సినిమా ఒక్క‌టి కూడా రిలీజ్ కాలేదు. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది టికెట్ రేట్ల త‌గ్గింపు. వ‌కీల్ సాబ్ సినిమా స‌మ‌యంలో త‌గ్గించిన రేట్ల‌తో ఇండ‌స్ట్రీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ స‌మ‌స్య ఎప్పుడు ప‌రిష్కార‌మ‌వుతుందా? అని ఇండ‌స్ట్రీ ఆశ‌గాఎదురు చూస్తోంది. సీఎం జ‌గ‌న్ తో స‌మావేశానికి ఆహ్వానం అంద‌డంతో.. హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు అంద‌రూ. ఇక‌, గ‌ట్టెక్కిన‌ట్టే అనుకున్నారు. కానీ.. ఇప్పుడు స‌ర్కారు తీసుకున్న‌ నిర్ణ‌యం చూసి.. ఊపిరి అలాగే ఆగిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు సినీ జ‌నాలు.

సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్న కొత్త‌ నిర్ణ‌యం నిర్మాతల్లో గుబులు రేపుతోంది. సినిమా టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి ఒక పోర్ట‌ల్ ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. దీనికోసం హోంశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ అధ్య‌క్ష‌త‌న ఓ క‌మిటీని కూడా నియ‌మించింది. ఏడుగురు స‌భ్యుల‌ను కూడా నియ‌మించింది. ఈ కొత్త విధానం ద్వారా టికెట్ బుకింగ్ విధానం మొత్తం ప్ర‌భుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇందుకు సంబంధించిన జీవోను ఆగ‌స్టు 31వ తేదీనే విడుద‌ల చేసింది.

ఈ కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తే ఏం జ‌రుగుతుందంటే.. టికెట్ రేట్ల నిర్ణ‌యంతోపాటు బుకింగ్ మొత్తం స‌ర్కారు చేతుల్లోనే ఉంటుంది. అంటే.. నిర్మాత‌లు డ‌బ్బులు పెట్టి సినిమాలు తీసుకొని, విడుద‌ల మాత్ర‌మే చేసుకోగ‌ల‌రు. టికెట్ల డ‌బ్బు మాత్రం ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నున్న పోర్ట‌ల్ ద్వారా.. స‌ర్కారు ఖ‌జానాకు చేరుతుంది. ఆ సొమ్ములో నుంచి స‌ర్కారు ప‌న్ను రూపంలో క‌త్తిరించుకుంటుందా? క‌మీష‌న్ రూపంలో తీసుకుంటుందా? ఎంత తీసుకుంటుంది? అన్న‌ది తెలియ‌దు. ఆ మొత్తం తీసుకోగా.. మిగిలిన డ‌బ్బును ఎన్ని రోజుల్లో నిర్మాత‌కు అందిస్తుంది? అన్న‌ది కూడా ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ వీటికి స‌మాధానాల‌ను వెత‌క‌నుంది.

ఈ విష‌యం తెలిసిన ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఊహించ‌ని షాక్ తిన్నార‌నే చెప్పాలి. ముఖ్య‌మంత్రితో స‌మావేశం ఏర్పాటైతే.. త‌గ్గిన టికెట్ రేట్ల‌ను మ‌ళ్లీ పెంచుకోవ‌చ్చ‌ని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. కానీ.. ఆ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌క‌పోగా.. త‌మ ఆదాయానికి కొత్త‌గా మ‌రో గండికొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ప్రొడ్యూస‌ర్లు.

ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీలో క‌నీసం ఒక్క‌రు కూడా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు లేక‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. అంటే.. సినిమా మొద‌లుపెట్టి విడుద‌ల చేసేవ‌ర‌కు ఎదుర‌య్యే క‌ష్టం కూడా క‌మిటీకి చెప్పుకునే అవ‌కాశం లేకుండా పోయింద‌ని వాపోతున్నారు సినీ జ‌నాలు. మ‌రి, దీనిపై సినీ ప‌రిశ్ర‌మ ఏ విధంగా స్పందిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.