కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. సినిమాలు కూడా భారీగానే రిలీజ్ అవుతున్నాయి. అయితే.. అవన్నీ చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడానికి కారణం ఏపీలో సానుకూలత లేకపోవడమే. ఆక్యుపెన్సీతోపాటు ప్రధానంగా టిక్కెట్ రేట్లు తగ్గించడం అన్నది ఇండస్ట్రీకి శాపంగా మారింది.
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సమయంలో సర్కారు ఉన్నట్టుండి రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న ఏపీ సర్కారుకు.. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందే.. సినిమా టిక్కెట్ల విషయం గుర్తుకు వచ్చింది. దీంతో.. రాత్రికి రాత్రే సినిమా టిక్కెట్ల ధరలు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జీవో కూడా జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా.. ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దంటూ ఆ జీవోలో ఆదేశించింది. ఈ నిర్ణయం.. వకీల్ సాబ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దలు సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి సినీ పెద్దలతో సమావేశమయ్యారు. చిరు నివాసంలో జరిగిన భేటీలో నాగార్జున, సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కల్యాణ్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో ఏయే అంశాలపై చర్చించాలనే విషయమై వీరు మాట్లాడుకున్నారు. ప్రధానంగా.. థియేటర్ల విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపులు పొందే అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. అదేవిధంగా.. బీ, సీ సెంటర్లలో టిక్కెట్ రేట్ల పెంపు అంశంపైనా ప్రభుత్వంతో చర్చించాలని డిసైడ్ చేశారు.
త్వరలో జగన్ తో జరగబోతున్న సమావేశంలో టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం సడలింపు ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. అసలు.. ఏపీ సర్కారు ఇండస్ట్రీ పెద్దలను పిలిచేది కూడా ఇందుకేనని అంటున్నారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో తగ్గించిన రేట్లను దీర్ఘకాలం కొనసాగిస్తే.. చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ప్రధానంగా సినిమా టికెట్ రేట్ల విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోపాటు ఇతర సమస్యల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంటున్నారు.
మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటిస్తుండడానికి కారణం ఇదేనని అంటున్నారు. మంచి బజ్ క్రియేట్ చేసిన అక్కినేని చైతూ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ ‘సీటీ మార్’ రిలీజ్ డేట్ ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వంతో మీటింగ్ ముగియగానే పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద క్యూ కడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.