Manchu Family: టాలీవుడ్ లో ఎలాంటి పాత్రనైనా అలవోకగా పండించగల అద్భుతమైన నటులలో ఒకరు మంచు మోహన్ బాబు. పౌరాణికమైన, సాంఘికమైన మోహన్ బాబు జీవించగలడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కామెడీ విలన్ గా, హీరో గా, నిర్మాతగా ఇలా అన్ని విధాలుగా విజయాలను చూసిన అతి తక్కువమంది నటులలో ఒకరు ఆయన. కేవలం సినీ రంగంలోనే కాకుండా, విద్యా రంగంలో కూడా ‘విద్యానికేతన్ యూనివర్సిటీ’ తో బలమైన ముద్ర వేసిన ఘనుడు ఆయన. అలాంటి లెజెండ్ వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు, మంచు మనోజ్ బాక్స్ ఆఫీస్ వద్ద పలు విజయాలు అయితే అందుకోగలిగారు కానీ, మోహన్ బాబు లాగా తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్, స్టార్ స్టేటస్ మరియు స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. మంచు మనోజ్ కాస్త భిన్నమైన ఆలోచనలతో సినిమాలు చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు కానీ, కొంతకాలం ఆయన సినిమాలకు దూరం అవ్వడం వల్ల మార్కెట్ మీద పట్టు కోల్పోయాడు.
ఇక మంచు విష్ణు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ పలు బాక్స్ ఆఫీస్ హిట్స్ ని కూడా అందుకున్నాడు కానీ, మార్కెట్ ని సంపాదించుకోలేకపోయాడు. పైగా మంచు విష్ణు కి సోషల్ మీడియా లో బోలెడంత నెగటివిటీ ఉంది. ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆయన మీద ఈ స్థాయి నెగటివిటీ ఏర్పడడానికి కారణం అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘మా’ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మంచు కుటుంబం నుండి మరో వారసుడు ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను మరెవరో కాదు మంచు విష్ణు కుమారుడు అవ్రం భక్త మంచు. ఈయన ‘కన్నప్ప’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు. అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని నేడు కృష్ణాష్టమి సందర్భంగా విడుదల చేసారు మేకర్స్. చూసేందుకు అచ్చం తండ్రి లాగానే ఉన్న అవ్రం ముఖం లో మంచి ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. చిన్నతనంలోనే నటన పరంగా పరిణీతి చెందిన వాడిగా కన్నప్ప చిత్రంలో కనిపిస్తాడని మంచు అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక కన్నప్ప సినిమా విషయానికి ఈసారి కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అనే లక్ష్యంతోనే మంచు విష్ణు ఈ చిత్రాన్ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తన ప్రాజెక్ట్ అంటూ మొదటి నుండి చెప్పుకొచ్చిన మంచు విష్ణు, అందుకు తగ్గట్టుగానే ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడడం లేదు. ప్రతీ ఇండస్ట్రీ నుండి ఒక సూపర్ స్టార్ ని ఈ చిత్రంలో నటింపచేసాడు. టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, శాండిల్ వుడ్ నుండి శివరాజ్ కుమార్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుండి మోహన్ లాల్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. సుమారుగా 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది.