CM Chandrababu : ఎన్నికల్లో హామీనిచ్చాడు.. నలుగురే చాలంటున్నాడు.. సాగనంపుతున్న ‘బాబు’..

గత ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. నిత్యం సమీక్షలు జరుపుతోంది. అయితే పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న.. సచివాలయ వ్యవస్థను ఏం చేయాలన్న ఆలోచనలో ఉంది. అందులో భాగంగా సచివాలయాల్లో సిబ్బందిని కుదించాలని భావిస్తోంది.

Written By: Dharma, Updated On : August 26, 2024 12:04 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu : వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. నాటి సీఎం జగన్ ఆ వ్యవస్థను తన మానస పుత్రికగా భావించారు. ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు సచివాలయాలను ఏర్పాటు చేశారు. దాదాపు 19 శాఖలకు సంబంధించి కార్యదర్శులను నియమించారు. ప్రజలు మండల కేంద్రాలకు తిరగకుండా.. నేరుగా గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు పొందేందుకు ఇదో మంచి మార్గంగా భావించారు.అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. సచివాలయ వ్యవస్థ పై కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖలో సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సచివాలయాలను కొనసాగిస్తూనే సిబ్బంది సేవలు విషయంలో మాత్రం వేరే ఆలోచనతో ఉండి. అవసరమైన వారికి మాత్రమే సచివాలయంలో ఉంచి.. మిగతా సిబ్బందిని ఇతర శాఖలో సర్దుబాటు దిశగా అడుగులు వేస్తోంది. అవసరం ఉన్నంతవరకే సిబ్బంది నుంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చూస్తోంది. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

* నలుగురిని ఉంచి మిగతా వారిని..
రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో లక్ష ముప్పై నాలుగు వేల మంది పనిచేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం లక్ష ఇరవై ఆరు వేల మంది మాత్రమే పని చేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో సగటున ఎనిమిది మంది పనిచేస్తున్నారు. కొన్ని సచివాలయాల్లో అయితే 10 నుంచి 14 మంది సిబ్బంది వరకు ఉన్నారు. అయితే వీరిలో నలుగురు వరకు మాత్రమే సచివాలయాల్లో ఉంచి.. మిగతా సిబ్బందిని ఆయా శాఖలో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్ తో పాటు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల్లో ఏ ఈల కొరత ఉంది. ఈ ఉద్యోగాలను సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

* పంచాయతీలు నిర్వీర్యం
గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయ కార్యదర్శులు వివిధ శాఖల ఆదేశాలతో పని చేస్తున్నారు. వార్డు సచివాలయాల్లోనూ అదే పరిస్థితి. అక్కడ పనిచేసే వారు ఎక్కువమంది మున్సిపల్ శాఖతో సంబంధాలు కలిగి ఉన్నారు. రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలని సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. దీంతో వార్డు సచివాలయాల్లో సైతం ఉద్యోగులను సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* సంక్షేమ పథకాల కోసం
సచివాలయ ఉద్యోగుల సేవలను ఇప్పటికే పింఛన్ల పంపిణీకి వాడుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు త్వరలో సంక్షేమ పథకాల అమలు ప్రారంభం కానుంది. వాటి బాధ్యతలు సైతం సచివాలయ ఉద్యోగులే చూడాల్సి ఉంది. అందుకే వాటి అవసరాల కోసం ఓ నలుగురు సచివాలయం ఉద్యోగులను విడిచిపెట్టి.. మిగతా వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.