బొద్దుగా.. ముద్దుగా ఉండే యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై చేసే సందడే వేరుగా ఉంటుంది. తనదైన మాటలతో, పంచ్ లతో రచ్చ రచ్చ చేసేస్తుంది. సూపర్ ఫాస్ట్ యాంకరింగ్ తో తక్కువ కాలంలోనే బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుందీ బ్యూటీ. ఎలాంటి షో అయినా.. తనదైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తర్వాతగానీ.. స్టేజీ దిగదు! అయితే.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఒక దశలో ఏడుపు వచ్చి, వెళ్లిపోవాలని అనిపించిందని తెలిపింది. మరి, ఆ వివరాలేంటో చూద్దాం..
అల్లు అర్జున్ మూవీ ‘జులాయి’తో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో బన్నీ చెల్లిగా నటించింది. ఆ తర్వాత.. పటాస్ షో ద్వారా యాంకర్ గా సత్తా చాటిన శ్రీ ముఖి.. స్టేజీ షోలలోనూ దుమ్ములేపుతోంది. యాంకరింగ్ లో కాంపిటేషన్ పెరుగుతుండడంతో తన ప్లేస్ ను కాపాడుకునేందుకు.. అదే సమయంలో సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంతేకాదు.. వెండితెరపై అనసూయ మాదిరిగా టాలెంట్ నిరూపించుకోవాలని కూడా ట్రై చేస్తోంది.
ఈ క్రమంలోనే శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ చిత్రం రాబోతోంది. అదే.. ‘క్రేజీ అంకుల్స్’. ప్రముఖ గాయకుడు మనో, తనికెళ్ల భరణి, రాజారవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో.. అంటే ఆగస్టు 19న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శ్రీముఖ. ఇందులో భాగంగా.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పలు వివరాలు వెల్లడించింది. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపింది.
యాంకరింగ్ ప్రారంభించిన తొలి నాళ్లలో చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పింది శ్రీముఖి. దీంతో.. అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా? అని ఏడ్చినట్టు కూడా తెలిపింది. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పి.. వచ్చేస్తానని కూడా చెప్పిందట. అయితే.. ఆయనే సర్ది చెప్పారట. ‘పెద్ద యాంకర్ కావాలి.. ఫేమస్ అవ్వాలి అంటే.. కొంత కష్టం తప్పదు’ అని ఆయన అనేవారట.
ఆ కష్టాలేంటో వివరిస్తూ.. షూటింగ్ సమయంలో గంటల తరబడి నిలబడాల్సి వస్తుందట. తాను చేసిన షోలలో చాలా వరకు నిలబడి చేసే ఉన్నాయని తెలిపింది. దీనివల్ల కాళ్లు తిమ్మిర్లు వచ్చేవట. ఇలాంటి ఇబ్బందులు చూసి.. ఇదంతా అవసరమా? అని అనుకునేదట. తనకే కాదని.. యాంకరింగ్ చేసేవారందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపింది. అయినా.. తప్పదు కాబట్టి కొనసాగించాల్సి వస్తోందని చెబుతోందీ బ్యూటీ.