Anasuya Bharadwaj: సెలబ్రిటీలకు బాధ్యత ఉండాలి.. మాట్లాడే మాటల్లో జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాటను సమాజం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటుంది.. వారు వేసే అడుగును భూతద్దంలో పెట్టి చూస్తుంది.. పైగా ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి సెలబ్రిటీలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉండాలి. అలా కాకుండా చేతిలో మైక్ ఉందని.. చుట్టూ జనాలు ఉన్నారని.. సోషల్ మీడియాలో తన గురించి చర్చ జరగాలనుకుంటే మాత్రం.. ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే బుల్లితెర యాంకర్/ సినీ నటి అనసూయ భరద్వాజ్ ఎదుర్కొంటున్నారు.
Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29 ‘ ఈవెంట్ ఖర్చు ఎంత..? దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా..? రాజమౌళి తెలివే తెలివి…
గతంలో ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టారు అనసూయ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆమె ప్రస్థానం మారిపోయింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా సినీ అవకాశాలు వచ్చాయి.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెలో ఉన్న అసలు సిసలైన నటిని అనసూయ బయటికి ప్రపంచానికి పరిచయం చేశారు. అంతకుముందు క్షణం అనే సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి అదరగొట్టారు. వాస్తవానికి ఇంతటి చరిష్మా ఉన్న తర్వాత సాధ్యమైనంత వరకు దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ అనసూయ అలా కాదు.
అనసూయ మాట్లాడే మాటలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని సార్లు అవి వివాదాస్పదమవుతుంటాయి. అసలే ఇది సోషల్ మీడియా కాలం కావడంతో అనసూయ మాటలకు.. చేసే చేష్టలకు వక్రభాష్యం చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఇదే విషయంపై అనసూయ అనేకసార్లు ఓపెన్ అయింది.. అయినప్పటికీ కొంతమంది నెటిజన్లు ఊరుకోవడం లేదు.. తాజాగా సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి అనసూయ హాజరయ్యారు. భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో తన వయసు రోజురోజుకు తగ్గిపోతోందంటూ కామెంట్స్ చేశారు. బంగారం ధర పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత నెటిజన్లు తమ పని మొదలుపెట్టారు. “ఏమన్నా అంటే అంటారు.. అనసూయ ఇలా మాట్లాడితే మాత్రం ఏమీ అనకూడదా” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరి కొందరేమో అనసూయకు అండగా నిలుస్తున్నారు. అనసూయ సెలబ్రిటీ కాబట్టి అలా అనడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే మాటలు 60 సంవత్సరాలకు పైబడిన వయసున్న హీరోలు అంటే ఇలానే కామెంట్లు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. సెలబ్రెటీలు మాట్లాడిన మాటలకు వక్ర భాష్యం చెప్పాల్సిన అవసరం లేదని. జస్ట్ వాటిని విని వదిలేస్తే సరిపోతుందని కొంతమందిని నెటిజన్లు అంటున్నారు.