Anaganaga Oka Raju Movie Review: నటీనటులు: నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, రావు రమేష్ తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్
ఛాయాగ్రహణం: యువరాజ్
దర్శకత్వం: మారి
నిర్మాత: నాగ వంశీ, సాయి సౌజన్య
జాతి రత్నాలు సినిమాతో జోగిపేట శ్రీకాంత్ గా ప్రేక్షకులను అలరించిన నవీన్ పోలిశెట్టి యూత్ లో కూడా క్రేజ్ సాధించాడు. ఆ సినిమా రిలీజ్ అయిన రెండేళ్లకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు. తర్వాత మూడేళ్లకు తాజాగా అనగనగా ఒక రాజు చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఈ రాజు సంక్రాంతి బరిలో విజేతగా నిలిచాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
గౌరపురం జమీందార్ గోపిరాజు గారి మనవడు రాజు(నవీన్ పోలిశెట్టి). తాతగారు ఆస్తినంతా రసిక రాజా ఉద్యమంలో స్త్రీలను ‘ఉద్దరించడానికి’ హారతి కర్పూరం చేయడంతో మనవడికి పాడుబడినట్టున్న బంగాళా తప్ప ఇంకేమీ మిగలదు. దీంతో ఫుల్ రిచ్ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ డబ్బు కష్టాలు తీరతాయని సంబంధాలు చూస్తుంటాడు. ఈ ప్రాసెస్ లో జమీందారు భూపతిరాజు(రావు రమేష్) కూతురు చారులత(మీనాక్షి చౌదరి) ని ఒక జాతరలో చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆపరేషన్ చారులత అనే సరదా కోడ్ నేమ్ తో తనను బురిడీ కొట్టించి పెళ్లి చేసుకుంటాడు. తీరా మ్యారేజ్ చేసుకున్న తర్వాత రాజుగారికి ఎలాంటి నిజాలు తెలిశాయి? పెళ్లి చేసుకుని మామగారి భారీ ఆస్తులకు యజమాని అవుదామనుకున్న కలలు తీరాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
బలమైన కథ, ప్రేక్షకులను కళ్ళు ఆర్పనీయని గ్రిప్పింగ్ కథనం లాంటివి ఆశించే ప్రేక్షకులకు పూర్తి వ్యతిరేక శైలిలో ఉండే సినిమా ఇది. ఉల్లిపొరలాంటి కథ. వరస పంచులతో, జోకులతో, లాజిక్కులు లాంటి కఠినమైన పదాలకు దూరంగా సరదా పల్లి బటానీ ట్రీట్ మెంట్ తో సినిమాను లాగించారు. అన్నీ జోకులకు నవ్వురాదు. అక్కడక్కడా కొన్ని నవీన్ మార్క్ మెరుపులు ఉన్నా పగలబడి నవ్వే కామెడీ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ లో మొదటి అరగంట మాత్రం ఇదేదో అవుట్ డెటెడ్ సినిమా అనే ఫీలింగ్ ఇస్తుంది. కానీ కథ ముందుకు సాగేకొద్ది దర్శకుడు సినిమాలో ఇన్వాల్వ్ చేయగలిగాడు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి తన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. ఎంత కామెడీ సినిమా అయినా ఎంతో కొంత ఎమోషన్, సెంటిమెంట్ లేకపోతే ఉప్పులేని వంటకంలాగా చప్పగా ఉంటుంది కాబట్టి క్లయిమాక్స్ పోర్షన్ లో పెద్దపాలెం పంచాయితీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నవీన్ పోలిశెట్టి, ఎర్రిబాబు(తారక్ పొన్నప్ప) తో తలపడడం సినిమాకు బలాన్నిచ్చింది. ఎలక్షన్ ఎపిసోడ్ కనుక లేకపోతే ప్రేక్షకులు వెర్రిమొహాలు వేసుకుని థియేటర్ బయటికి రావలసిన పరిస్థితి ఉండేది.
ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టిది వన్ మ్యాన్ షో. చాలా డైలాగ్స్ నవీన్ నటన వల్లే హైలైట్ అయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నవీన్ కు తగ్గట్టే హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్క్రీన్ పై అందంగా, ఎనర్జిటిక్ గా కనిపించింది. నవీన్ కు గుమాస్తా గా చమ్మక్ చంద్ర పంచులు కూడా నవ్వించాయి. విలన్ గా తారక్ పొన్నప్పకు పెద్దగా స్కోప్ దక్కలేదు. వీక్ విలన్ అనే చెప్పాలి. తక్కువసేపే ఉన్నా మాస్టర్ రేవంత్ కూడా నవ్వించాడు.
దర్శకుడు మారి ఈ సినిమాతో పాస్ మార్కులు మాత్రమే సాధించాడు. ఎందుకంటే బలమైన కథ లేకపోవడం ఒక మైనస్ అయితే, చాలా చోట్ల జోకులకు నవ్వురాకపోవడం ప్రేక్షకులకు అసహనం కలిగిస్తుంది. ఇదంతా రైటింగ్, డైరక్షన్ డిపార్ట్మెంట్ లోపాలే. మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం యావరేజ్ గా ఉంది. మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మిక్కీ జె మేయర్ తన శీలికి భిన్నంగా మాస్ పాటలు కంపోజ్ చేయడం ఒక విశేషం. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా ఉంది.
అద్బుతమైన ఆస్కార్ సినిమా స్థాయి అంచనాలు పెట్టుకోకుండా సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఓకే. టైమ్ పాస్ సినిమా. టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడాలా అని ప్రశ్నిస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పలేం.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. రొటీన్, ప్రిడిక్టబుల్ సీన్స్
2. వీక్ స్టోరీ
3. అక్కడక్కడా నవ్వు రాని జోకులు
– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. క్లైమాక్స్ ఎపిసోడ్
2. నవీన్ నటన
రేటింగ్: 2.5 /5
ఫైనల్ వర్డ్: యావరేజ్ రాజు