Junior NTR: మన నిర్ణయాలే భవిష్యత్ ని డిసైడ్ చేస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ నిర్ణయాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఒక సూపర్ హిట్ మూవీ వదులుకున్న ఎన్టీఆర్ ఇప్పటికీ బాధపడుతున్నాడట. బాలనటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన ఎన్టీఆర్… హీరోగా మారి అనతికాలంలో స్టార్ అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ డాన్సులు, నటన, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి.
సింహాద్రి అనంతరం ఎన్టీఆర్ వరుస పరాజయాలు చవి చూశాడు. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2007లో రాజమౌళి యమదొంగ చిత్రాన్ని తెరకెక్కించే వరకు ఎన్టీఆర్ కి హిట్ దక్కలేదు. ఈ స్ట్రగులింగ్ పీరియడ్ లో ఎన్టీఆర్ కొన్ని హిట్ చిత్రాలు వదిలేశాడు. వాటిలో భద్ర ఒకటి. దర్శకుడు బోయపాటి శ్రీను మొదటి చిత్రం భద్ర. రవితేజ, మీరా జాస్మిన్ జంటగా నటించారు.
2005లో భద్ర భారీ హిట్ కొట్టింది. రవితేజ కెరీర్ కి భద్ర విజయం చాలా ఉపయోగపడింది. ఈ సబ్జెక్టు మొదట ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట. బోయపాటి శ్రీను కొత్త దర్శకుడు కావడం వలనో, బిజీ షెడ్యూల్స్ కారణంగానో… ఎన్టీఆర్ భద్ర మూవీ చేయలేదు. అదే ఏడాది ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు, నరసింహుడు విడుదలై నిరాశపరిచాయి. డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాయి. భద్ర చేసి ఉంటే ఎన్టీఆర్ కి వరుస పరాజయాలు తప్పేవి. కాగా భద్ర చేయనందుకు ఎన్టీఆర్ అనంతరం చాలా బాధపడ్డారట. ఈ విషయాన్ని సన్నిహితులతో చెప్పుకుని వేదన చెందారట.
బోయపాటి-ఎన్టీఆర్ కాంబోలో దమ్ము టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. మరలా వీరిద్దరూ కలిసి చిత్రం చేయలేదు. ఇక బోయపాటి హీరో బాలకృష్ణతో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. బాలయ్యతో పాటు రవితేజ, అల్లు అర్జున్ తో బోయపాటి హిట్స్ కొట్టాడు. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. రాజమౌళి బ్యాండ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ దేవరతో కూడా ఎన్టీఆర్ హిట్ కొట్టాడు. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.