Sai Dharam Tej: ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఆయనకు ఆపరేషన్ కూడా చేశారు. చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మొదట చూసిన ప్రత్యక్ష సాక్షులు 108కు సమాచారం అందించి అంబులెన్స్ లో తరలించారు. 108 వాహనం చేరుకోగానే ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బాధ్యతగా వ్యవహరించి ఆస్పత్రికి వెళ్లేందుకు సహకరించాడు.
అయితే ఈ ప్రమాదం గురించి మొదట తెలిసింది మాత్రం అల్లు అర్జున్ కే. ఆయన పుష్ప షూటింగ్ లో భాగంగా కాకినాడలో ఉన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, అత్తయ్య సురేఖ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసి అందరిని అలర్ట్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ అందరిని కలవరం చెందకుండా ఉండాలని సూచించారు. సాయిధరమ్ తేజ్ కు జరుగుతున్న వైద్యంపై కూడా ఆరా తీశారు.
ఆస్పత్రి వద్దకు మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయి పరామర్శించారు. మొత్తానికి బన్నీ ఇస్తున్న సమాచారంతోనే అందరు ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై కలత చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
సాయిధరమ్ తేజ్ నడిపిన వాహనం వేరే వారి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు తెలియడంతో ఆయనపై కేసు పెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. కోలుకున్న వెంటనే 336,279, మోటార్ వాహన చట్టం 184 కింద కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు అబ్దుల్ ఫరాన్, ఆసిఫ్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు.