Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2’ కి సంబంధించిన చివరి థాంక్యూ మీట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులను అనుమతించకుండా, కేవలం మూవీ టీం మాత్రమే జరుపుకున్నారు. ప్రతీ ఒక్కరు మనస్ఫూర్తిగా సినిమాకి పని చేసిన వాళ్లకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ, ఈ సినిమా వల్ల కలిగిన మధురమైన అనుభూతులను, జ్ఞాపకాలను పంచుకుంటూ నిన్న సాయంత్రం ఆహ్లాదకరంగా ఈ ఈవెంట్ జరిగింది. వాస్తవానికి ఈ చిత్రం థియేటర్స్ లో నడుస్తున్న సమయంలోనే అనేక సక్సెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకున్నారు. కానీ సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ మొత్తాన్ని రద్దు చేసారు. కానీ ఇటీవలే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
ఇప్పటికైనా ఒక థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేసి మనస్ఫూర్తిగా మాట్లాడకపోతే బాగుండదని, ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘అప్పుడప్పుడు పుష్ప గెటప్ లో నన్ను నేను చూసుకుంటే చాలా ఆనంద పడుతుంటాను. కానీ నన్ను అలా చూపించడానికి ప్రతీ ఒక్కరు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ కష్ట ఫలితమే నేను అలా కనపడడానికి కారణం. ఈ సినిమా సక్సెస్ మెయిన్ క్రెడిట్ ని నేను నా డార్లింగ్ సుకుమార్ కి ఇస్తాను. అతని ఊహల్లో నుండి పుట్టుకొచ్చిన క్యారక్టర్ ఈ పుష్ప రాజ్.ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు రాబట్టిందంటే అదంతా సుకుమార్ గారి మ్యాజిక్’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘సుకుమార్ ని చూస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. పోయినసారి ఆయన గురించి మాట్లాడుతూ కన్నీళ్లు వచ్చేసాయి. వాటిని యూట్యూబ్ లో తెగ వాడేశారు. అందుకే నేను ఈసారి నువ్వు నా వైపు చూడకు, నేను కూడా నీ వైపు చూడను, చూస్తే ఏడ్చేస్తాను అని చెప్పాను. సుకుమార్ నా దృష్టిలో ఒక మనిషి కాదు, ఎమోషన్’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా సక్సెస్ ని నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా నేను వాళ్లకు ప్రమాణం చేస్తున్నాను, ఇలాగే జీవితాంతం వాళ్ళు గర్వపేదెలా చేస్తాను’ అంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలను అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ని ఈ కొత్త లుక్ లో చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.