Allu Aravind : ‘పుష్ప 2’ ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసిలాట ఘటన లో రేవతి అనే మహిళా మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీ తేజ్ కి తీవ్ర గాయాలవ్వడంతో అతను కోమాలోకి వెళ్లడం. గత రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ కుర్రాడి ఆరోగ్యం మెరుగు అయ్యేందుకు అల్లు అర్జున్ తరుపున నుండి చికిత్స కోసం అన్ని విధాలుగా ఆర్ధిక సాయం అందిస్తుండగా, ప్రభుత్వం కూడా అండగా నిలబడి సహాయం చేస్తుంది. అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ని కలిశాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అరవింద్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆయన శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి మీడియా తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నేడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఆసుపత్రి కి రావడం జరిగింది. రోజు రోజుకి అతని ఆరోగ్యం మెరుగు పడుతుందని వైద్యులు చెప్తున్నారు. మా వంతుగా మేము వైద్యానికి అవసరమైన ఆర్ధిక సాయం అందిస్తున్నాము. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఆ కుర్రాడికి అండగా నిలబడడం అభినందనీయం. చాలా మంది అల్లు అర్జున్ శ్రీ తేజ్ ని చూసేందుకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గురించి కోర్టు లో కేస్ నడుస్తుండడం వల్ల అల్లు అర్జున్ ఇక్కడికి రాకూడదు. కానీ అల్లు అర్జున్ కి శ్రీ తేజ్ ని కలిసి అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది. తాను రాలేదు కాబట్టి కనీసం నువ్వైనా వెళ్లి రా డాడీ అన్నాడు. అందుకే వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.
ఈ సందర్భంగా తనని శ్రీ తేజ్ ని కలిసేందుకు అనుమతిని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి కి అల్లు అరవింద్ కృతఙ్ఞతలు తెలియచేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు కూడా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని సోషల్ మీడియా లో ప్రార్థనలు చేస్తున్నారు. అతని న్యూస్ బులిటెన్ కోసం ఆరాలు తీస్తున్నారు. కోర్టు కేస్ సర్దుకున్నాక అల్లు అర్జున్ కూడా శ్రీ తేజ్ ని కలవబోతున్నాడట. మరోపక్క హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ కి ఇచ్చినటువంటి మధ్యంతర బైలు ని రద్దు చెయ్యాలంటూ సుప్రీమ్ కోర్టు లో పిటీషన్ వేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా సీఎం రేవంత్ పై ఈ వ్యవహారం లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ అభిమానులపై కేసులు కూడా పడ్డాయి.