Allu Aravind- Maha Bharatam: కొన్నాళ్ల క్రితం వేయి కోట్ల బడ్జెట్ తో రామాయణం తెరకెక్కించనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఏళ్ళు గడిచిపోతున్నా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తర్వాత మహాభారత ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. హ్రితిక్ రోషన్ అర్జునుడిగా రామ్ చరణ్ కర్ణుడిగా నటిస్తున్నట్లు కొన్ని గాసిప్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా మహాభారత ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. అల్లు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో హాట్ స్టార్ ఒరిజినల్స్ గా మహాభారతం తెరకెక్కనుంది.

దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ పోస్టర్స్ విడుదల చేశారు. అవి చూస్తే మనం వేరే ప్రపంచంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. భీకరంగా పోరాడుతున్న యుద్ధ ఏనుగు, భారీ పడవలు, ఆకాశాన్ని అంటే భవనాలతో కూడిన కాన్సెప్ట్ ఆర్ట్ పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా మహాభారత సిరీస్ తెరకెక్కనున్నట్లు అర్థం అవుతుంది. ఆ స్థాయిలో తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు.
మరి ఈ ఎపిక్ మైథలాజికల్ ప్రాజెక్ట్ లో నటించే నటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించలేదు. అల్లు ఎంటర్టైన్మెంట్స్, హాట్ స్టార్, మైథోవర్స్ స్టూడియోస్ నిర్మిస్తున్నట్లుగా మాత్రమే రివీల్ చేశారు. ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ కి మంచి ప్రచారం దక్కింది. మరోవైపు మహాభారతం రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ గా ఉంది. ఎవరూ ఊహించని బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో మహాభారతం తెరకెక్కిస్తానని ఆయన గతంలో చెప్పారు. మహేష్ మూవీ తర్వాత రాజమౌళి మహాభారత చేస్తారనే ఓ టాక్ ఉంది.

ఇప్పుడు మహాభారతం సిరీస్ గా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి అల్లు అరవింద్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ భాగం అవుతారా? ఏదైనా ప్రధాన లేదా కీలక రోల్ చేస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పుష్ప 2 ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్న ఆయన మరో ఏడాది కాలంలో ఫ్రీ కానున్నాడు. పుష్ప 2 తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లు సమాచారం. మొత్తంగా మహాభారత వెబ్ సిరీస్ ప్రకటన ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది.