Allari Naresh: ఒకప్పుడు గ్యారంటీ చిత్రాల హీరోగా సత్తా చాటాడు అల్లరి నరేష్. వరుస విజయాలతో అనతి కాలంలో 50 చిత్రాలు పూర్తి చేసిన హీరో ఆయన. కామెడీ హీరోగా తన మార్క్ క్రియేట్ చేసి ఎదురు లేకుండా దూసుకుపోయాడు. ఈ జనరేషన్ రాజేంద్ర ప్రసాద్ అనిపించుకున్నాడు. అన్ని రోజులు మనవి కాదు అన్నట్లు… నరేష్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ వారసుడిగా నరేష్ పరిశ్రమకు పరిచయమయ్యారు. సాధారణంగా హీరో అనగానే ప్రతి ఒక్కరూ చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోలనే తలచుకుంటారు. వస్తూ వస్తూనే కమర్షియల్ హీరోగా నిరూపించుకోవాలి అనుకుంటారు.

అల్లరి నరేష్ దానికి భిన్నంగా ఆలోచించాడు. తన ఫేస్, పర్సనాలిటీకి కామెడీ హీరోనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. పోటీలేని ఈ కేటగిరిలో దూసుకుపోవాలి అనుకున్నాడు. అనుకున్నట్లే నరేష్ కామెడీ హీరోగా పరిశ్రమలో స్థిరపడిపోయారు. 2008లో అత్యధికంగా అల్లరి నరేష్ 8 సినిమాలు విడుదల చేశాడు. ఈ జనరేషన్ హీరోలు ఎవరూ చేరుకోలేని రికార్డు అది. కేవలం కామెడీ చిత్రాలకే పరిమితం కాకుండా నేను, ప్రాణం, గమ్యం, విశాఖ ఎక్స్ ప్రెస్ వంటి సీరియస్ రోల్స్ చేశారు.
ఎంత సక్సెస్ ఫుల్ హీరో అయినా ఏదో ఒక దశలో గడ్డుకాలం ఎదుర్కొంటాడు. టైర్ టూ హీరోల గ్రాఫ్ ఒకసారి పడిపోతే లేవడం కష్టం. నరేష్ పరిస్థితి కూడా అదే అయ్యింది. 2012లో విడుదలైన సుడిగాడు చిత్రం తర్వాత ఆయనకు హిట్ పడలేదు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేశారు. గత ఏడాది నాంది టైటిల్ తో సీరియస్ మూవీ చేశారు. అది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మరో సోషల్ బర్నింగ్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.

నరేష్ లేటెస్ట్ మూవీ ‘ఇట్లు నేరేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రం నవంబర్ 25న విడుదల అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. కొన్నాళ్లుగా నరేష్ పాలిటిక్స్ లోకి వెళుతున్నారని పుకార్లు వస్తుండగా స్పష్టత ఇచ్చారు. పాలిటిక్స్ నాకు తెలియని సబ్జెక్టు. కాబట్టి రాజకీయాల జోలికి నేను వెళ్ళను. డైరెక్షన్ పై ఆసక్తి ఉంది. అది చేస్తాను. నేను రాజకీయాల్లోకి రావడం ఒక పుకారు మాత్రమే అని తేల్చిపారేశారు. ఇక రేపు విడుదలవుతున్న ఇట్లు నేరేడుమిల్లి ప్రజానీకం మూవీపై బజ్ లేదు.