Unstoppable With NBK 4: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆడియన్స్ బాలయ్యలో సరికొత్త కోణాన్ని చూసారు. ఎప్పుడూ కోపం గా ఉండే బాలయ్య లో ఇంత ఫన్ యాంగిల్ కూడా ఉందని ఈ షో ద్వారానే తెలిసింది. ముందుగా బాలయ్య తో ఇలాంటి టాక్ షో చేయాలనే ఆలోచన వచ్చిన అల్లు అరవింద్ ని మెచ్చుకోవాల్సిందే. సినిమాల్లో గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా డైలాగ్స్ చెప్పగలిగే బాలయ్య, పబ్లిక్ ఫంక్షన్స్ లో ప్రసంగాలు తడిపొడిగా ఇవ్వడాన్ని మనం గమనించొచ్చు. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా నడిచేవి. అలాంటి బాలయ్య ఒక టాక్ షో కి హోస్ట్ గా ఇంత అద్భుతంగా చేయగలడా..?, అది కూడా అందరికంటే గొప్పగా అని ఇతర హీరోల అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీజన్, మధ్యలో మూడవ సీజన్ లిమిటెడ్ ఎడిషన్ ని కూడా పూర్తి చేసుకుంది.
ఇప్పుడు నాల్గవ సీజన్ కి సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ని నేడు దసరా కానుకగా విడుదల చేసారు ఆహా మీడియా టీం. ఈ ప్రోమో లో బాలయ్య బాబు సూపర్ హీరో గా కనిపించాడు. మొదటి ఎపిసోడ్ ఈ నెల 24 వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుందని ఈ ప్రోమో ద్వారా తెలిపారు. అయితే మొదటి ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఇటీవలే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసారు. త్వరలో ప్రోమో కూడా విడుదల కాబోతుంది. ఇక రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ రెండవ ఎపిసోడ్ కి అతిథిగా విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ హాజరు కాబోతుంది. ఐశ్వర్య రాయ్ కి సంబంధించిన సినిమాలు ఇప్పుడేమి విడుదలకు దగ్గర్లో లేవు , అయినప్పటికీ కూడా ఆమెని ముఖ్య అతిథిగా పిలిచారు.
ఐశ్వర్య రాయ్ తో బాలయ్య బాబు ఇది వరకు ఎలాంటి సినిమాలో నటించలేదు. కనీసం ఒక స్పెషల్ సాంగ్ లో కూడా వీళ్లిద్దరు కలిసి చేయలేదు, అయినప్పటికీ కూడా బాలయ్య షో అనగానే ఆమె డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఐశ్వర్య రాయ్ తెలుగు లో ఒక్క ఇంటర్వ్యూ లో కూడా పాల్గొనలేదు, ఒక్క టాక్ షోలో కూడా కనిపించలేదు. ఆమె మొట్టమొదటిసారి కనిపించబోయే టాక్ షో ఇదే అవ్వబోతుండడం విశేషం. ఈ టాక్ షోలో రీసెంట్ గా ఆమెపై వస్తున్న విడాకుల రూమర్స్ కి సమాదానాలు దొరికే అవకాశం ఉంది. అలాగే లైవ్ అమితాబ్ బచ్చన్ కి ఫోన్ చేసి మాట్లాడించే ప్రోగ్రాం కూడా డిజైన్ చేశారట, దీపావళి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.