AHA Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇంటా బయట ఒకేలా ఉంటారు. ఆయనకు మనస్సులో ఏది దాచుకోవడం తెలియదు. ఏది మాట్లాడునుకుంటే అదే మాట్లాడుతారు.. కొట్టాలనిపిస్తే కొడుతారు.. తిట్టాలనిపిస్తే తిడుతారు. ఈ విషయం తెలుగు ప్రజలందిరకీ తెల్సిన విషయమే. ఇక ఆయన ఫ్యాన్స్ కు బాలకృష్ణ ఏం చేసినా పునకాలే..!

బాలకృష్ణ కొడితే కొట్టించుకుంటాం.. తిడితే తిట్టించుకుంటాం.. మధ్యలో మీకేంటీ? అని ఆయన అభిమానులే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన సందర్భాలు అనేక ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోని వాళ్లు బాలయ్య గురించి మంచిగానే చెబుతారు. ఆయన్ని దగ్గర నుంచి చూసిన హీరోలంతా బాలకృష్ణది చిన్నపిల్లడి మనస్తత్వమని చెబుతుంటారు.
బాలయ్య ఎవరికీ హాని కలిగించే మనిషి కాదని.. తన పనేంటో తాను చేసుకొని వెళుతుంటారని.. ఎవరైనా నమ్మితే ప్రాణం ఇస్తారని.. అదే నమ్మక ద్రోహం చేస్తే వాళ్లకు దబిడిదిబిడేననే చెబుతుంటారు. అలాగే దర్శకులు ఏం చెబితే అదే చేస్తారని.. ఎందుకు.. ఏమిటి? అని కూడా ప్రశ్నించారని అంతా అనే వారికి ప్రాధాన్యం ఇస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఇటీవలే ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం హోస్టుగా మారారు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ప్రసారమవుతున్న టాక్ షోకు బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఓటీటీ ప్రియులను అలరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తికాగా వాటన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో లేటెస్టుగా విడుదలై నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ ప్రోమోలో బాలకృష్ణ రాజమౌళితో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా మన కాంబినేషన్‌లో సినిమా పడలేదు.. నా అభిమానులు అడిగారని నాకు తెలుసు.. మీరు నన్ను హ్యాండిల్ చేయలేరని అన్నారంటగా’’ అని ప్రశ్నించారు.
దీనికి జక్కన్న బదులిస్తూ.. ‘‘నిజానికి నాకు భయం సార్.. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. మీకు కోపం వస్తే ఆగరు.. ఎదుటి మనిషి ఎవరు.? ఏంటి అని చూడకుండా నోటికి ఎంతమాట వస్తే అంత మాట తిట్టేస్తారు..’ అని సమాధానమిచ్చారు. ఆ వెంటనే బాలకృష్ణ బదులిస్తూ ఎవరో డైరెక్టర్‌తో జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ.. ‘స్క్రిప్ట్ తీసి నేలపై కొట్టి నేను ఈ సినిమా చేయను’ అని చెప్పేశాను అంటూ ఘాటుగా రియాక్టయ్యారు.
ఆ తర్వాత జక్కన్న మాట్లాడుతూ ‘‘అలా అయితే మీరు చేసింది తప్పని’’ చెప్పుకొచ్చారు. దీనికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అలా అయితే నేను బాలయ్యను కాదు.. బాలయ్య కాక్‌టేల్’’ అన్నారు. దీంతో రాజమౌళి ఒక్కసారిగా నవ్వేశారు. ఇలా ఆహా ఆన్ స్టాబుల్ ప్రోమో సందడిగా సాగింది. ఇదే షోలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం పాల్గొన్నాడు. ప్రోమోతోనే హైప్ క్రియేట్ కావడతో ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా మొత్తానికి బాలయ్యను హ్యండిల్ చేయడం అంత ఈజీ కాదనే విషయాన్ని రాజమౌళి అర్థం చేసుకున్నట్లే కన్పిస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం అనేది కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఫ్యాన్స్ మాత్రం వీరి కాంబినేషన్ ను కోరుకుంటున్నారు. మరీ అది ఎప్పుడు జరుగుతుందో వేచిచూడాల్సిందే..!
