Dalapathi: రజనీకాంత్.. భారతదేశ సినీ చరిత్రలోనే అద్భుతమైన నటుల్లో ఒకడు. వయసు ఏడు పదులు దాటినా తన స్టైల్, మేనరిజంతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆమధ్య దర్బార్ అనే సినిమా పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు తాజాగా నెల్సన్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇండియన్ సినిమాలో మణిరత్నానిది డిఫరెంట్ స్టైల్. హృద్య మైన కథ లను సినిమాలుగా మలచి ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ రెండు దిగ్గజాలు సృష్టించిన సంచలనమే దళపతి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, తమిళ ఎవర్గ్రీన్ ఛార్మింగ్ హీరో అరవిందస్వామి, ప్రముఖ నృత్యకారిణి శోభన కలిసి ఈ సినిమాలో నటించారు.. 1991 నవంబర్ ఐదు న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. సంచలన విజయం సాధించింది. ఇళయరాజా అందించిన పాటలన్నీ ఈ సినిమాలో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు సంగీత ప్రియుల చెవిలో మారుమోగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఏమైందో గానీ మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక సినిమా రాలేదు. మణిరత్నం తాజాగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ తొలిభాగం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఏదైనా పాత్ర పోషించాలి అనుకున్నారట
పాన్నియన్ సెల్వన్ సినిమాలో ఏదైనా ఒక పాత్రలో నటించాలని అప్పట్లో రజినీకాంత్ అనుకున్నారట. ఈ సినిమాలో నటుడు శరత్ కుమార్ పోషించిన పళయ పళు వేట్ట యార్ పాత్రలో నటిస్తానని స్వయంగా రజనీకాంత్ మణిరత్నాన్ని అడిగితే అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంతే చెప్పారు. అయితే దాదాపు 31 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోందని సమాచారం. ఇప్పటికే మణిరత్నం చెప్పిన స్టోరీలైన్ రజనీకాంత్ కు నచ్చిందట! ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ నిర్మాణనంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.. ఇక రజనీకాంత్ కూడా జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత డాన్ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత మణిరత్నం సినిమాలో నటిస్తారా? లేక ముందుగానే ఆయనతో ఒక చిత్రం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.. వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

లైకా ప్రొడక్షన్ కు ఒక సినిమా చేయాలి
తమిళంలో లైకా ప్రొడక్షన్ అనేది పెద్ద బ్యానర్లలో ఒకటి. ఈ బ్యానర్లో రజనీకాంత్ మూడు సినిమలు తీశారు. ఒప్పందంలో భాగంగా మరొక సినిమా ఈ బ్యానర్ కు రజనీకాంత్ చేయాల్సి ఉంది. అయితే మణిరత్నంతో చేయబోయే సినిమా ఈ బ్యానర్ లోనే ఉంటుందని సమాచారం. అయితే గతంలో దర్బార్ సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మించింది. మురగదాస్ వంటి దర్శకుడు ఏ సినిమాను తెర కెక్కించినా ఆశించిన మేర వసూళ్లు దక్కలేదు. ఈ సినిమా వల్ల లైకా ప్రొడక్షన్ అధినేత సు భాస్కరన్ భారీగా నష్ట పోయిన నేపథ్యంలో అప్పట్లో మరో సినిమా చేస్తానని రజినీ మాట ఇచ్చారు..అందులో భాగంగానే మణిరత్నం దర్శకత్వం వహించే సినిమాకు సు భాస్కరన్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు కోలీవుడ్ వర్గాల భోగట్టా! అయితే ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమా నిర్మాతల్లో సు భాస్కరన్ కూడా ఒకరు.