AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాల్లో మార్పులు కనిపించడం లేదు. వైసీపీ, టీడీపీ దొందూ దొందే అన్న చందంగా పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ సంక్షేమ పథకాలను నమ్ముకుంటోంది. ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపించడమొక్కటే మార్గమని విశ్వసిస్తోంది. దీంతో అభివృద్ధి కార్యక్రమాల ఊసే కనిపించడం లేదు. పలితంగా వైసీపీ పాలన పట్ల ప్రజలు మొగ్గు చూపడం లేదనే వాదన వస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా తన విశ్వసనీయత చాటుకోవడం లేదు. ప్రజాబలాన్ని కూడగట్టడంలో వెనకడుగు వేస్తోంది. చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఇతర నేతలకు ఉండటం లేదు. ఫలితంగా రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల భవితవ్యం గందరగోళంలోనే పడనుందని సమాచారం.

వైసీపీ అభివృద్ధి పథకాల ఊసు ఎత్తడం లేదు. ఎక్కడ తట్టెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో రోడ్లన్ని అధ్వానంగా మారాయి. మరోవైపు మూడు రాజధానుల వ్యవహారంపై అభాసుపాలైంది. కోర్టు అక్షింతలు వేసినా మూడు రాజధానులు నిర్మించి తీరుతామని వైసీపీ నేతలు చెప్పడంతో ప్రజల్లో వారి స్థాయి కనుమరుగవుతోంది. అధినేత జగన్ సూచన మేరకే నాయకులు అలాంటి ప్రకటనలు చేస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎప్పుడో చంద్రబాబు వేసిన పథకాలనే నేటికి వైసీపీ కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. జగన్ పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో పాలన పక్కదారి పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు అధికారం పొందాలని ఆరాటపడుతున్నా రెండు పార్టీల్లోనూ తగిన బలాలు కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ స్థానాలు గల్లంతనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల స్వయంకృతాపరాధంతోనే ప్రజల్లో పరపతి పోగొట్టుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో ఏపీలో అధికారం కోసం రెండు పార్టీల్లో తగినంత బలం కనిపించడం లేదు. టీడీపీలో చంద్రబాబు ఒక్కరే బలమైన నేతగా కనిపిస్తున్నా మిగతా వారికి అంతటి ప్రాధాన్యం దక్కడం లేదు.

రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీలకు విఘాతమే కలిగిస్తున్నాయి. నేతలు పర్యటనలు చేయడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వైసీపీ నేతలైతే ప్రజలకు తమ ముఖాలను చూపించిన దాఖలాలు లేవు. దీంతో తమ నేతలెవరో కూడా వారికి తెలియడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నా మిగతా వారు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా చూస్తున్నారు. దీంతోనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నేతల ఆశలు గల్లంతే కానున్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో తెలియడం లేదని చెబుతున్నారు.
ఈ క్రమంలో కొత్త పార్టీ వైపు ఓటర్లు చూస్తున్నారని సమాచారం. జనసేన పార్టీ వైపు మొగ్గుతారనే సర్వేలు సూచిస్తున్నాయి. చంద్రబాబు, జగన్ మధ్య మూడో వ్యక్తికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ర్ట రాజకీయాల్లో పవన్ పెనుమార్పులు తీసుకొస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.