తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం రోజు రోజుకి తీవ్రమౌతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నివారణ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలకు మద్ధత్తుగా పలువురు పారిశ్రామికవెత్తలు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున ఆర్ధిక సహకారం అందిస్తున్నారు. ఆ క్రమంలో ప్రముఖ సంగీత సంస్థ `ఆదిత్య మ్యూజిక్ ` కరోనా నివారణకు తమ వంతుగా ఆర్ధిక సహకారం అందించడం జరిగింది .
ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, దినేశ్ గుప్త, ఆదిత్య గుప్తలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు 31 లక్షలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు తెలంగాణ సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనెజింగ్ డైరెక్టర్ ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ కరోనా కారణంగా యావత్ మానవాళి ఇబ్బందుల్లో పడింది. కరోనా మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు చాలా అభినందనీయం. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ ప్రాణాల్ని లెక్క చేయకుండా పోలీసులు, వైద్య, శానిటరీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. వారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెబుతూ తొందర్లోనే సంపూర్ణంగా కరోనా నివారణ జరగాలని ఆ విధంగా దేవుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు.