చదువుకు వయసుతో సంబంధం లేదంటుంటారు. కొందరు ఒక్క డిగ్రీ సర్టిఫికెట్‌తోనే ఆగకుండా మళ్లీమళ్లీ డిగ్రీలు చేస్తుంటారు. పీజీలు.. డాక్టరేట్లు అంటూ తమకు నచ్చిన చదువులో రాణిస్తుంటారు. విద్యార్హతలు పెంచుకునేందుకు వయసుతో కూడా సంబంధం లేదు. చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటే సరిపోతుంది.
తాజాగా సినీ నటి హేమ కూడా అదే కేటగిరీలో చేరారు. డిగ్రీ పట్టా పొందేందుకు ఆమె ఎగ్జామ్స్ రాస్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె.. ఆదివారం నల్లగొండ జిల్లాలోని ఎన్టీ కాలేజీలో అర్హత పరీక్ష రాశారు.
పరీక్ష అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఎప్పటి నుంచో డిగ్రీ చేయాలని కోరిక ఉంది. హైదరాబాద్ అయితే ఇబ్బందిగా ఉంటుందని నల్లగొండలో పరీక్ష రాసిన. ఎవరి కంటా పడకూడదని అనుకున్నా. అందుకోసమే ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చానని’ చెప్పింది. ప్రస్తుతం తాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని, నల్లగొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితరాలు ఉండటంతో ఇక్కడ సేఫ్ అని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో తమకు బంధువులు కూడా ఉన్నారని చెప్పారు.