Actress Sneha: ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది నటి స్నేహా. ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత స్నేహా పలు వాణిజ్య ప్రకటనలతో పాటు సినిమాల్లో సహాయ నటిగా, హీరోలకు వదిన, అక్క వంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా స్నేహా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్ కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారని, వారికి వడ్డీ కింద 26 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు.

అయితే ఇప్పుడు వారు తనని మోసం చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఆరోపించారు. అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదు పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. తన ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తు చేపట్టాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా స్నేహా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్నేహ చివరగా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించారు.