Sirivennela Seetharama Sastry: తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ వినీలాకాశం నుంచి ఓ దృవతార నేలరాలింది. ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు తనికెళ్ళ భరణి. అనంతరం సిరివెన్నెల సతీమణిని తనికెళ్ల భరణి పరామర్శించారు.
ఆమెను ఓదార్చే సమయంలోనూ ఆయనకు కన్నీళ్లు ఆపుకోలేక బోరున ఏడ్చేశారు తనికెళ్ళ. త్రివిక్రమ్ ఓదార్చే ప్రయత్నం చేసిన కూడా భరణి ఏడుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సిరివెన్నెలతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు మేం ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం, స్రవంతి మూవీస్ మాకు వేదిక అన్నారు. స్రవంతి మూవీస్ లో ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామన్నారు. అక్కడే ఎన్నో రోజులు నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయని… తనకంటే కేవలం రెండు నెలలే సిరివెన్నెల పెద్దవాడని చెప్పారు. తనను ఎంతో అప్యాయంగా పలకరించేవాడంటూ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుంచి వారి కుటుంబంతో తాను టచ్‌లోనే ఉన్నానని తనికెళ్ళ భరణి తెలిపారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని, రానా, మురళీమోహన్ వంటి ప్రముఖులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీప్రముఖులు సందర్శనార్ధం ఫిలింఛాంబర్ లో ఉంచారు. కాగా ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.