
Sai Dharam Tej: చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ పునర్జన్మ ఎత్తాడు. బైక్ ప్రమాదంలో ఆయన మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు. 2021 సెప్టెంబర్ 10 సాయంత్రం దుర్గం చెరువు వద్ద సాయి ధరమ్ తేజ్ బైక్ అదుపుతప్పింది. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ని గుర్తించి ఆసుపత్రికి చేర్చాడు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అక్కడ నుండి అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ నెలల తరబడి ఆసుపత్రి బెడ్ కి పరిమితమయ్యారు. నెల రోజులకు కూడా కోమా నుండి బయటకు రాలేదని తెలిసింది.
తాజా ఇంటర్వ్యూలో సాయి ధరమ్ బైక్ ప్రమాదంపై స్పందించారు. తనను కాపాడిన వ్యక్తిని గుర్తు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి అంబులెన్స్ కి కాల్ చేశాడట. త్వరగా ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేశారట. అతని కారణంగానే గోల్డెన్ అవర్ లో సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రికి చేరగలిగాడట. ప్రాణం ప్రసాదించిన సయ్యద్ అబ్దుల్ ని సాయి ధరమ్ కోలుకున్నాక కలిశారట. కృతజ్ఞతలు చెప్పాడట. అయితే డబ్బుపరంగా ఏం ఇవ్వలేదట. ప్రాణం కాపాడిన వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేను… అందుకే ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మొహమాటం లేకుండా ఫోన్ చేయమని చెప్పానని సాయి ధరమ్ తేజ్ అన్నారు.
నా ఫ్యామిలీ మెంబర్స్ అతనికి ఏమైనా డబ్బులు ఇచ్చారో లేదో నాకైతే తెలియదని సాయి ధరమ్ తేజ్ అన్నారు. మద్యం మత్తులో వేగంగా బైక్ నడిపి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడని ప్రచారం జరిగింది. ఈ పుకార్లను ఆయన ఖండించారు. నాకు మద్యం అలవాటు లేదు. ఆ రోజు డైరెక్టర్ దేవా కట్టాను కలిసి వస్తుండగా ప్రమాదం జరిగిందని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

ప్రమాదం వలన సాయి ధరమ్ మాట కోల్పోయాడట. నిరంతరం ప్రాక్టీస్ చేయగా గొంతు వచ్చిందట. కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. రికవరీ అయ్యాక సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21న విడుదల కానుంది. కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించారు.